AP Govt Employees : ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉద్యోగులు, సమస్యలపై స్పందించకపోతే సమ్మె బాట- బండి శ్రీనివాసరావు
05 February 2024, 22:34 IST
- AP Govt Employees : ఒకటో తేదీన జీతం, పింఛన్ వస్తుందన్న నమ్మకం ఉద్యోగుల్లో పోయిందని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె బాటపడతామన్నారు.
బండి శ్రీనివాసరావు
AP Govt Employees : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ స్వరం పెంచుతున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేసేందుకు వెనుకాడబోమంటున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ చెల్లంచలేదని, ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము సకాలంలో అందడంలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సరైన సమయానికి తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ నెల 11న ఏపీ జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఫిబ్రవరి 12న ఉద్యోగుల సమస్యలపై సీఎస్ కు వినతి పత్రం అందిస్తా్మన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఒకటో తేదీన జీతం, పింఛన్ వస్తాయన్న నమ్మకం ఉద్యోగుల్లో పోయిందని బండి శ్రీనివాసరావు ఆవేదన చెందారు.
పీఆర్సీ బకాయిలు చెల్లించండి- ఏపీ జేఏసీ ఉద్యోగులు
కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు, జీతంతో పాటు రావాల్సిన డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీ బకాయిలు, పదవీ విరమణ తర్వాత వచ్చే బకాయిలను చెల్లిస్తుందని ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఏపీజేఏసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 12 వ పీఆర్సీ కమిషన్ ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా దాని ఛైర్మన్ కు కనీసం సీటులేదని, సిబ్బంది కేటాయింపు లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 జిల్లాల నుంచి హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులంతా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విషయంలో జాప్యం చేస్తుందని, తద్వారా ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు సరెండర్ లీవులు చెల్లించలేదు
రేయింబవళ్లు కష్టపడే పోలీసులకు రెండు సంవత్సరాలుగా కనీసం సరెండర్ లీవులు కూడా చెల్లించడం లేదని, ప్రస్తుత పరిస్థితులు ఉద్యోగులు అర్థం చేసుకుని, ఓపికతో, సహనంతో, నమ్మకంతో చెల్లింపుల కోసం వేచి చూస్తున్నారని వారికి ఇవ్వాల్సిన ఆర్ధిక ప్రయోజనాల విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆర్ధిక సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పూర్తి స్థాయిలో అమలుకాని ఎంప్లాయిస్ హెల్త్ స్కీంతో పెన్షనర్లు/ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగసంఘాలు గత 2022 ఫిబ్రవరి లో ఉద్యమించినపుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికార్లు సమక్షంలో అంగీకరించిన సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
ఉద్యోగులతో పాటు పెన్షనర్లుకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించక పోవడం దారుణమని, ప్రభుత్వం ఇచ్చిన GO లు ఇచ్ఛిమ హామిలే అమలు కాకపోతే భవిష్యత్ లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కొత్తకొత్త డిమాండ్లు ఏమి చేయడం లేదని ప్రభుత్వపెద్దలు,ఉన్నతాధికారులు చర్చలు సందర్భంగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బకాయిలు చెల్లింపుల కోసం, పెండింగ్ సమస్యలు పరిష్కారం కొరకు ఉన్నతస్దాయిలో తక్షణమే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తక్షణమే పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల లో ఉన్న ఆందోళనను తొలగించాలని డిమాండ్ చేశారు.