AP Employees GPF: జిపిఎఫ్ నిధుల విడుదల భిక్ష కాదంటున్న ప్రభుత్వ ఉద్యోగులు…
AP Employees GPF: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం కొనసాగుతోంది. గురువారం కొన్ని సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఉద్యోగులకు బకాయిలను విడుదల చేశామనే ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP Employees GPF: ప్రభుత్వ ఉద్యోగులకు జిపిఎఫ్ నిధుల విడుదల, ప్రభుత్వ బిక్ష కాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు విమర్శించారు. జిపిఎఫ్ సొమ్ము ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము అని, దానిని తిరిగి చెల్లించి ఏదో మేలు చేసినట్టుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగులకు చెందిన సొమ్మును ముట్టుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, ఉద్యోగుల జీత భత్యాలు కు తగినట్టుగా కొంత సొమ్మును ఉద్యోగులు ప్రభుత్వం వద్దే దాచు కుంటున్నారని, పబ్లిక్ ఖాతా లో జమ అయిన సొమ్మును వినియోగించుకునే హక్కు శాసనసభ కు కూడా లేదని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తప్పు పట్టింది.
జిపిఎఫ్ విషయంలో ప్రభుత్వానిది బ్యాంకు నిర్వహించే పాత్ర మాత్రమే ఉంటుందని, అలాంటిది ప్రభుత్వం ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాలలో సొమ్మును ఎలా తేసుకుంటారని ప్రశ్నించారు. 2022 మార్చి నెలలో ఉద్యోగుల ఖాతాల నుంచి వందల కోట్లు తీసేసుకున్నారని, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఇది నేరమని చెబుతున్నారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు బదిలీ చేయడంపై అకౌంటెంట్ జనరల్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశామని చెబుతున్నారు.
2022 జూన్ లో ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, కొందరు ఉద్యోగ సంఘాల నేతలు జీపిఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసేయడం సాంకేతిక తప్పిదం అని చెప్పారని, వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును మళ్లించి తీసుకోవడం కూడా నేరమేనని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా నిధుల మళ్లింపు సాంకేతిక తప్పిదం అని చెప్పిందని, ఈ వ్యవహారం పై విచారణ చేసి ఎవరిది తప్పిదం అని తేల్చాలన్నారు.
66 వేల మంది ఉద్యోగుల ఖాతా ల నుంచి 486 కోట్లు ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టు కేంద్రం కూడా పార్లమెంటు లో చెప్పిందని, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి 486 కోట్ల సొమ్మును తెలియకుండా తీసేసుకోడం దొంగతనం అవుతుందన్నారు. దీనిపై ఆర్థికశాఖలోని ఏ అధికారి పై చర్య తీసుకున్నారని, ట్రెజరీ డైరెక్టర్ విచారణ నివేదిక ఏమైందని ప్రశ్నించారు.
జీపీఎఫ్ ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ము మొత్తానికి వడ్డీ తో సహా ఆర్థిక శాఖ కార్యదర్శి గా ఉన్న సత్యనారాయణ జీతం నుంచి రికవరీ చేసి ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. మార్చి 2022 నాటికి జిపిఎఫ్ ఖాతాల్లో 11 వేల కోట్ల మొత్తం ఉందని, 2023 మార్చి నాటికి అది 13 వేల కోట్లు గా ఉంటుందని అంచనా వేశారు. గడచిన ఏడాదిలో ఉద్యోగులు పదవీ విరమణ చేయలేదని, ప్రభుత్వం ఆ సొమ్మును ఉద్యోగులకు తెలియకుండా తీసేసుకుంటున్నడున దానిపై ఉద్యోగులకు భయాందోళనలు కలుగుతున్నాయని ఆరోపించారు.
ఉద్యోగుల డిపాజిట్ సొమ్ముకు రక్షణ కల్పించాలని చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాల వినియోగించ కుండా చూసేలా హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.