Power loom Electricity Subsidy : నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, పవర్ లూమ్ లకు భారీగా విద్యుత్ రాయితీ
23 February 2024, 14:36 IST
- Power loom Electricity Subsidy : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పవర్ లూమ్ లకు విద్యుత్ సబ్సిడీ ప్రకటించింది. యూనిట్ కు 94 పైసలు రాయితీగా అందిస్తుంది. పవర్ డ్యూటీని రూ.1 నుంచి 6 పైసలకు తగ్గించింది.
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Power loom Electricity Subsidy : నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పంది. పవర్ లూమ్(Power looms) చేనేత కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్ లకు విద్యుత్ సబ్సిడీ(Electricity Subsidy) అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవర్ లూమ్ విద్యుత్ వినియోగంలో ప్రతి యూనిట్ కు 94 పైసలు ప్రభుత్వం రాయితీగా అందిస్తున్నట్లు తెలిపింది. పవర్ డ్యూటీని రూ.1 నుంచి 6 పైసలకు తగ్గించినట్లు ప్రకటించింది. విద్యుత్ రాయితీతో పవర్ లూమ్స్ వినియోగించే నేతన్నలకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పవర్ లూమ్ లకు విద్యుత్ సబ్సిడీ
ఏపీలోని చాలా జిల్లాల్లో నేతన్నలు పవర్ లూమ్స్ ద్వారా వస్త్రాలు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కేవలం హ్యాండ్ లూమ్స్ చేనేత కార్మికులకు మాత్రమే మాత్రమే అందుతున్నాయని, పవర్ లూమ్ వారికి సాయం అందడంలేదని వాపోతున్నారు. విద్యుత్ రాయితీలు కల్పించి తమను సైతం ఆదుకోవాలని గత కొంతకాలంగా నేతన్నలు ప్రభుత్వాన్ని(AP Govt) కోరుతున్నారు. నేతన్నల అభ్యర్థనలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పవర్ లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్ సబ్సిడీలు ప్రకటించింది.
నేతన్నలకు ఏటా రూ.24 వేలు
చేనేత కార్మికులుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం(YSR Nethanna Nestham) కింద ఏటా రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తుంది. చేనేత కార్మికులు పవర్ లూమ్ ఉత్పత్తులతో పోటీ పడటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి చేనేత కార్మికుడు సొంత మగ్గం కలిగి ఉండి, దానిపై పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారు నేతన్న నేస్తం పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నా ఒక్క కార్మికుడికి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకానికి దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈ పథకానికి అనర్హులు. అంటే నూలు వడికే వారు, పడుగు తయారు చేసేవారు, అద్దకం పని వారు, అచ్చులు అతికే వారు అనర్హులు.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్
అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి ఏటా ప్రభుత్వం రూ.24 వేల వారి ఖాతాల్లో జమచేస్తుంది. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం, బియ్యం కార్డు లేదా రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించి ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారికి సచివాలయ ఉద్యోగులు ఒక నెంబర్ ఇస్తారు. దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు షెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి రూ.24,000 వేలు వై.యస్.ఆర్ నేతన్న నేస్తం పథకం ఖాతాల్లో జమ చేస్తుంది.
నేతన్న నేస్తం పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ :
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, స్టేట్ హ్యాండ్లూమ్ అసోసియేషన్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. వీటిని సచివాలయాల్లో సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలి.