YS Sharmila : ఏపీలో నియంత పాలన, ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారా?- వైఎస్ షర్మిల ఫైర్
22 February 2024, 14:56 IST
- YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. సచివాలయానికి బయలుదేరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు.
వైఎస్ షర్మిల
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. మెగా డీఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్(Congress) నేతలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. భారీగా పోలీసులను మోహరించారు. ఆంధ్రరత్న భవన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, మస్తాన్ వలీ, ఇతర నేతలను అరెస్టు చేశారు. పోలీసుల తీరుకు నిరసగా వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలు ఆంధ్రరత్న భవన్ ముందు బైఠాయించారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
షర్మిల అరెస్టు
అనంతరం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు(YS Sharmila Arrest ) చేశారు. ఆమెను వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆమెను ఏ స్టేషన్ కు తరలించారో తెలియలేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అక్రమ అరెస్టులు
వైసీపీ(Ysrcp) పాలనపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేస్తూ మెగా డీఎస్సీ(DSC)ని దగా డీఎస్సీ చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు అండగా నిలబడితే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. డీఎస్సీలో 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కేవలం 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చంద్రబాబును నాడు జగన్ అడగలేదా? అని ప్రశ్నించారు. ఆ మాటలు నేడు వైసీపీకి వర్తించవా? అని నిలదీశారు. ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు(Chandrababu) కన్నా జగన్ పాలన మరింత అధ్వానంగా ఉందన్నారు. సచివాలయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు లెక్కలు చూపి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అందుకు సిగ్గుపడాలని షర్మిల విమర్శించారు.
పోలీసులా? వైసీపీ బంటులా?
ఉద్యోగాల భర్తీపై వైసీపీ ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. శాంతియుత మార్గంలో చలో సెక్రటేరియట్ చేపడితే పోలీసులు తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉందా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను, నిరసన తెలిపిన వారిని పోలీసుల సాయంతో వైసీపీ అణచివేస్తుందని ధ్వజమెత్తారు. పోలీసులను వైసీపీ బంటుల్లా వాడుకుంటారా? మీరేమైనా తాలిబన్లా? అని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాల నోటిఫికేషన్ల వరద పారిస్తామన్నారని, కానీ ఒక్క జాబ్ క్యాలెండరు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.