Ysrcp Booth Committee : పోల్ మేనెజ్మెంట్ పై వైసీపీ ఫోకస్, 47 వేలకు పైగా బూత్ కమిటీలు నియామకం
Ysrcp Booth Committee : సిద్ధం పేరుతో ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ...పోల్ మేనెజ్మెంట్ పై దృష్టి పెట్టింది. ఎన్నికలకు 50 రోజులు ముందుగానే బూత్ లెవల్ కమిటీలను నియమించింది.
Ysrcp Booth Committee : ఏపీలో ఎన్నికల (AP Assembly election 2024)హడావుడి మొదలైంది. ఇప్పటికే అధికార వైసీపీ పరోక్షంగా ఇన్ ఛార్జ్ పేరుతో అభ్యర్థులను ఖరారు చేస్తుంది. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఎన్నికల కార్యచరణ సిద్ధమైన వైసీపీ... సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన బూత్ కమిటీల(Booth Committee) నియామకాన్ని వైసీపీ... ఎన్నికలకు 50 రోజుల ముందే పూర్తి చేసింది. 47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి చేసింది. ప్రత్యర్థుల కంటే ఎన్నికల ప్రచారంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో వైసీపీ(Ysrcp) స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో సీఎం జగన్ కార్యకర్తల సన్నాహంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు వైసీపీ 68 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, 16 మంది పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశామని ఆ పార్టీ చెబుతోంది.
47 వేలకు పైగా బూత్ కమిటీలు
ప్రతీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు పాటిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణపైన ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించింది. దీంతో పాటు ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీలను ఏర్పాటు చేసింది. వైసీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ బూత్ కమిటీలు(Ysrcp Booth Committee ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా, మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేశారు. ప్రతీ కుటుంబాన్ని బూత్ కమిటీ సంప్రదించి వారికి ప్రభుత్వంలో అందిన లబ్ధి వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా.. ఎన్నికల సమయంలో కీలకంగా నిలిచే పోల్ మేనేజ్మెంట్ పై సీఎం జగన్(CM Jagan) దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను ఎక్కువగా రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్ కమిటీలను నియమించారు. ఈ క్రమంలో ప్రతీ ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల వార్ రూమ్ రెడీ
ఎన్నికల ప్రచారంతో పాటుగా పోలింగ్ రోజున పార్టీ శ్రేణులు కీలకంగా వ్యవహరించాల్సిన ఉంటుంది. ఈ క్రమంలో చురుకుగా ఉండే బూత్ కమిటీలపై(Ysrcp Booth Committee ) వైసీపీ శ్రద్ధ పెట్టింది. బూత్ కమిటీలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. జిల్లా కేంద్రాల నుంచి ప్రతీ పోలింగ్ బూత్ స్థాయి వరకు ఎన్నికల పరిస్థితులు, పోలింగ్ రోజున జరిగే పరిణామాలు, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లతో వార్ రూమ్ సిద్ధం చేసింది.
సంబంధిత కథనం