Opinion: ఏపీ ఎన్నికల్లో ప్రజాసంఘాల ప్రాముఖ్యత మరిచిన ప్రతిపక్షాలు-opposition forgets the importance of public rights organizations in ap assembly elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Opposition Forgets The Importance Of Public Rights Organizations In Ap Assembly Elections

Opinion: ఏపీ ఎన్నికల్లో ప్రజాసంఘాల ప్రాముఖ్యత మరిచిన ప్రతిపక్షాలు

HT Telugu Desk HT Telugu
Feb 19, 2024 09:29 AM IST

‘పౌర సమజానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించకుండా టీడీపీ-జనసేన గెలవడానికి తామిద్దరమే చాలన్నట్టు అతివిశ్వాసంతో నేల విడిచి సాము చేస్తున్నాయి. చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అవుతుంది. చిటికెన వేలును కూడా కలుపుకుంటేనే పిడికిలి అవుతుంది.’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ.

ప్రజాసంఘాలను కలుపుకుపోకుండా విజయం సాధ్యమా?
ప్రజాసంఘాలను కలుపుకుపోకుండా విజయం సాధ్యమా? (HT_PRINT)

ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి కారణాలను అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహరచన చేయడం మంచిది. ఆ రెండు రాష్ట్రాలో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో ప్రజా సంఘాలు, పౌర సమాజం ముఖ్య భూమిక పోషించాయి. కానీ, ఇక్కడ పౌర సమజానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించకుండా టీడీపీ-జనసేన గెలవడానికి తామిద్దరమే చాలన్నట్టు అతివిశ్వాసంతో నేల విడిచి సాము చేస్తున్నాయి.

చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అవుతుంది. చిటికెన వేలును కూడా కలుపుకుంటేనే పిడికిలి అవుతుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజా సంఘాల్ని, పౌర సమాజాన్ని, కార్మిక సంఘాల్ని, మేథావులను ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోరాడితేనే అధికారానికి చేరువవుతారు. చరిత్రలో జరిగిన ఉదంతాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే టీడీపీ-జనసేన కూటమి మరో ఓటమికి సిద్ధం కావాల్సి ఉంటుంది.

2014లో కలిసి కొట్టాం. కాబట్టి, దానినే ప్రామాణికంగా తీసుకుని ఈసారి కూడా ఇద్దరమే చాలు, వైఎస్సార్సీపీని దించేస్తామని తెలుగుదేశం-జనసేన నాయకులు కలలు కంటున్నారు. 2014కి ముందు జగన్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు కేసులు, మరోవైపు నాలుగేళ్లుగా అధికారలేమితో ఆర్థికంగా, మానసికంగా బలహీనంగా ఉన్నారు. అయినా అధికారానికి దగ్గరగా వచ్చి, తెలుగుదేశం శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేశారు.

కానీ, ఈసారి మాత్రం అలా కాదు, 151 సీట్లతో అధికారంలో ఉన్నారు. ఆయన వెనక దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, రెడ్లు బలమైన ఓటు బ్యాంకుగా నిలబడ్డారు. వీరితో పాటు నవరత్నాలతో లబ్ది పొందుతున్న పేద బలహీన వర్గాలవారు ఉన్నారు. క్యూలల్లో నిలబడి ఓట్లేసిదే కూడా వీళ్లే! ఈ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడానికి టీడీపీ-జనసేన దగ్గర వ్యూహాం ఉందా?

ఆ ఫార్ములా సరిపోతుందా?

కేవలం ‘ప్రజా వ్యతిరేకత ప్లస్ కమ్మా, కాపు సామాజికవర్గం ఈక్వల్ టూ అధికారం’ అనే ఫార్ములా ఈ ఎన్నికల్లో సానుకూల శేషాన్ని ఇస్తుందనుకోవడం అతివిశ్వాసమే! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2009లో బీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చేశాననుకున్నారు. ఆ సమయంలో ఆయన ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలతో పాటు ప్రజా సంఘాలను, పౌర సమాజాన్ని తక్కువ అంచనా వేశారు.

కానీ, ఫలితాల తర్వాత పరిస్థితిని అధ్యాయనం చేస్తే... ప్రజా రాజ్యం టీడీపీ, కాంగ్రెస్ ఓట్లను చీల్చగా... లోక్ సత్తా పార్టీ మాత్రం సుమారు 25 స్థానాల్లో టీడీపీ విజయవకాశాలను దెబ్బతీసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంఘాలను, పౌర సమాజాన్ని కలుపుకుపోతేనే కూటమి లక్ష్యం నెరవేరుతుంది. ఇటీవల కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి కారణం... అందరినీ కలుపుకుపోవడమే!

మేలుకో కర్ణాటక అంటూ అక్కడి ప్రజా సంఘాలు, పౌర సమాజం బీజేపీకి వ్యతిరేకంగా అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాయి. తెలంగాణ జన సమితి, జాగో తెలంగాణ, కమ్యూనిస్టులు, వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ఆ మధ్య 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూ ట్యూబ్ చానల్స్ పెట్టుకోవాల్సిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక్కడ లోతుగా పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, తీన్మార్ మల్లన్న, మన తొలివెలుగు రఘు లాంటి వాళ్లను కలుపుకుపోవడం కూడా కాంగ్రెస్‌కి కలిసొచ్చిందనే విషయం అర్థమవుతుంది. అందరినీ కలుపుకుపోవడమే కాంగ్రెస్‌కి మేలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల మద్దతు ఉన్న వివిధ చిన్న పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని సూచించినా... అతి విశ్వాసంతో ఒంటరిగా పోటి చేసిన కాంగ్రెస్ అక్కడ పరాభవాన్ని మూటగట్టుకుంది.

మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులను కలుపుకుని ఆ తర్వాత వారిని వదిలేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మూల్యం చెల్లించుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ విజయం వెనక ప్రశాంత్ కిశోర్ ఉన్నారని లేదా అంతా తన గొప్పదనం వల్లే సాధ్యమైందని అని జగన్ అనుకోవచ్చు! కానీ, ఆ విజయం వెనక కూడా అనేక ప్రజా సంఘాలు, పౌర సమాజం, కమ్యూనిస్టులు సహా ఎంతోమంది మేధావులు చాపకింద నీరులా పని చేశారు.

రాయలసీమ విద్యాంతుల వేదికతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు, రిటైర్డ్ జడ్జీ చలసాని శ్రీనివాస్ రావు, అజయ్ కల్లాం, బొజ్జా దశరథరామ్ రెడ్డి లాంటి వాళ్లు తమ ప్రసంగాలతో టీడీపీకి పరోక్షంగా నష్టం చేశారు. పదే పదే ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడుతూ టీడీపీని ఇరకాటంలో పెట్టారు. న్యూట్రల్‌గా ఉండేవాళ్లలో సైతం టీడీపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించడంలో ముఖ్యపాత్ర పోషించారు.

హక్కుల కోసం పోరాడుతున్న ప్రజాసంఘాలు

ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా అనేక ప్రజా సంఘాలు పని చేస్తున్నాయి. కమ్యూనిస్టులు, అమరావతి బాధిత రైతులు, ప్రజా సంఘాలు, మేథావులు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాల రామకృష్ణ, రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ విద్యావంతుల వేదికతో పాటు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్ రావు, నిమ్మగడ్డ రమేశ్ మరికొంతమంది మేథావులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు.

విద్యావంతులైన నిరుద్యోగ యువతీయువకులు అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, సర్పంచుల సంఘాలతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా ఉన్న వివిధ ప్రజా సంఘాలు గడిచిన నాలుగేళ్లలో తమ హక్కుల కోసం అనేక ధర్నాలు, ఉద్యమాలు చేసి, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాయి. వీరికి టీడీపీ-జనసేన నోటి మాటగా మద్దతిచ్చాయేగానీ, క్షేత్రస్థాయిలో వారి వెనక అండగా నిలబడిన దాఖలాలు లేవు.

ఉత్తరాంధ్రలో క్యాన్సర్ ఆస్పత్రి కోసం, సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏపీ లోక్ సత్తా అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ బహిరంగంగా టీడీపీ-జనసేనకు మద్దతిస్తున్నా... ఆయన్ను కలిసి మాట్లాడే స్థితిలో కూడా కూటమి నాయకులు లేరు. ప్రజా సంఘాలకు ప్రాణం పోయొద్దని టీడీపీ-జనసేన కూటమి భావిస్తున్నట్టుంది! మరి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా సంఘాలు ఆ పార్టీకి ప్రాణం పోసిన సంగతిని టీడీపీ నాయకులు మర్చిపోయారా?

యువగళం పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన వివిధ ప్రజా సంఘాలకు, విద్యార్థి యువజన సంఘాలకు పాదయాత్ర ముగింపు సభకు ఆహ్వానమే అందలేదు! రణ స్థలంలో జనసేన నిర్వహించిన కార్యక్రమానికి కూడా ప్రజా సంఘాలకు పిలుపు రాలేదు. టీడీపీ-జనసేన ప్రజా సంఘాలకు ప్రాణం పోయవద్దనుకుంటే, ప్రజా సంఘాలు, పౌర సమాజం మాత్రం వీళ్లకు రాబోయే ఎన్నికల్లో మద్దతిచ్చి ఎందుకు ఊపిరి పోయాలి?

2004లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడంతో పాటు పౌర సమాజాన్ని, ప్రజా సంఘాలను, మేధావులను, కవులను, కళాకారులను కలుపుకుపోవడం వల్లే డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజా సంఘాలు, కవులు కళాకారుల వెంట జనం ఉండకపోవచ్చు. కానీ, వారు పరోక్షంగా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు. టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని ఆయా పార్టీల అభ్యర్థుల బ్యాలెన్స్ షీట్ చూసి టికెట్లు ఇస్తే సరిపోదు! సామాజిక న్యాయం పాటించాలి, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి.

సమాజంలో మంచిపేరున్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలి. అప్పుడే వారు ఆశించిన ఫలితం వస్తుంది. టీడీపీ-జనసేన పార్టీలు... ఆ రెండు పార్టీలు మాత్రమే పొత్తుతో ఆగిపోకుండా భావసారుప్యత గల అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలు, పౌర సమాజం, దళిత సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, కవులు, కళారులు, మేధావులను కలుపుకోవాలి.

అప్పుడే, టీడీపీ-జనసేన కూటమి అధికారానికి అవసరమైన మద్దతును అధికార వైఎస్సార్సీపీ పార్టీ నుంచి తన వైపు తిప్పుకోగలుగుతుంది. లేదంటే టీడీపీ-జనసేన పార్టీలు 2024 మరో ఓటమికి ‘సిద్ధం’ కావాల్సిందే!

-జి. మురళీ కృష్ణ, రీసెర్చర్,

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ

జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్
జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు)

IPL_Entry_Point