తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fibernet Case : చంద్రబాబుకు మరో షాక్..! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి

AP Fibernet Case : చంద్రబాబుకు మరో షాక్..! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి

12 October 2023, 18:34 IST

google News
    • AP Fibernet Case Updates:ఫైబర్‌ నెట్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కు కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఆదేశించింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసు
ఏపీ ఫైబర్ నెట్ కేసు

ఏపీ ఫైబర్ నెట్ కేసు

AP Fibernet Case Updates: స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు… మరో షాక్ తగిలింది. ఫైబర్‌ నెట్‌ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 లోపు కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది.

స్కిల్‌ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.

బెయిల్ పిటిషన్ వాయిదా…

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు . ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి విచారణ జరిపారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసులు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందని, మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్ కొట్టేసినందున తాను ప్రజా జీవితంలో ఉన్నానని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సీఐడీ గడువ కోరడంతో కేసు విచారణ 17వ తేదీకి వాయిదా పడింది.

తదుపరి వ్యాసం