తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Skill Scam Case : స్కిల్ స్కామ్‌ కేసులో లోకేశ్ కు భారీ ఊరట.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

Skill Scam Case : స్కిల్ స్కామ్‌ కేసులో లోకేశ్ కు భారీ ఊరట.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

12 October 2023, 14:31 IST

google News
    • Skill Scam Case Updates : స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ కు భారీ ఊరట లభించింది. కేసుపై గురువారం విచారించిన హైకోర్టు…లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
నారా లోకేశ్ కు భారీ ఊరట
నారా లోకేశ్ కు భారీ ఊరట

నారా లోకేశ్ కు భారీ ఊరట

Skill Scam Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని కోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ. ముద్దాయిగా చూపని కారణంగా అరెస్ట్ చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. కేసును డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ధర్మాసనం… గురువారం వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన కోర్టు…. లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఒకవేళ కేసులో నారా లోకేశ్‌ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామని తెలిపింది ఏపీ సీఐడీ. ఫలితంగా లోకేశ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు తెరపైకి రావటంతో హైకోర్టును ఆశ్రయించారు లోకేశ్. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారించిన న్యాయస్థానం… ముందస్తు బెయిల్ ను మంజూరు చేయటమే గాక, అక్టోబరు 12వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి లోకేశ్ పిటిషన్ పై విచారించగా… ఇరువైపు తరపు న్యాయవాదనలు విన్న కోర్టు… డిస్పోజ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఫలితంగా ఈ కేసులో లోకేశ్ కు ఊరట దక్కినట్లు అయింది.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

CBN Bail Petition: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను గతంలోనే ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ పై విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. సిఐడి కస్టడీ పిటిషన్‌ ఏసీబీ కోర్టులో డిస్మిస్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఏసీబీ కోర్టులో సిఐడి న్యాయవాదులు అభ్యంతరం చెప్పడంతో పిటిషన్ డిస్మిస్ చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి విచారణ జరిపారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసులు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందని, మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు.

ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్ కొట్టేసినందున తాను ప్రజా జీవితంలో ఉన్నానని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సీఐడీ గడువ కోరడంతో కేసు విచారణ 17వ తేదీకి వాయిదా పడింది.

తదుపరి వ్యాసం