Karimnagar Crime : ఆస్తి కోసం దారుణం - చెల్లి హత్యకు అక్క ప్లాన్, అమలు చేసిన బావ! డౌట్ రాకుండా...
Murder For Property in Karimnagar : ఆస్తి కోసం సొంత చెల్లి హత్యకు అక్క ప్లాన్ వేయగా… బావ హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటికి వచ్చాయి.
ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రక్త సంబంధాలను పట్టించుకోకుండా తోబుట్టువులు సైతం కడతేర్చుతున్నారు. అస్తి కోసం అక్క ప్లాన్ వేయగా భావ మరదలును హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
గంగాధర మండలం గర్షకుర్తి కి చెందిన చిందం మాధవి(23) ఈనెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎమ్మెస్సీ చదువుతున్న మాదవి తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువుతుంది. తండ్రీ ఇటీవల మృతి చెందగా తల్లి కూతురు ఇద్దరే ఇంట్లో ఉండేవారు.
తల్లి లక్ష్మి… పెద్దబిడ్డ అత్తగారి ఊరు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కు వెళ్ళగా ఇంట్లో మాధవి మాత్రమే ఉంది. అనుహ్యంగా 14వ తేదీన మాదవి ఉరి వేసుకుని చనిపోయింది. అయితే బాడీ నేలకు తాకుతు ఉండడంతో గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సొంత వాళ్లే హంతకులు..
తల్లి లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవి ఎలా చనిపోయిందని పోలీసులు ఆరా తీశారు. ఇంటి ముందు తాళం వేసి ఉండి, ఇంటి వెనుకాల డోర్ గడియ తీసి ఉండడంతో వెనుక నుంచి వచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.
తన మానసికస్థితి సరిగా లేకపోవడంతో పెద్దబిడ్డ గుండా మానస, అల్లుడు ఆంజనేయులు రమ్మంటే వారి ఇంటికి వెళ్ళానని మాదవి తల్లి లక్ష్మి చెప్పారు. తమకు శత్రువులు ఎవరూ లేరని తెలిపారు. మరి మాధవి ఎలా చనిపోయిందని పోలీసులు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టగా మాధవి అక్క బావనే హత్య చేసినట్లు తేలింది. ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆస్తి కోసమే పక్కా ప్లాన్ తో...
ఎమ్మెస్సీ చదివే మాదవి వేరే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని అక్కాబావలు భరించలేకపోయారు. ఆమె ఆస్తిని రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ముందుగా తల్లి లక్ష్మిని తమ వద్దకు రప్పించుకున్నారు.
ఇదే అవకాశంగా భావించిన గుండా ఆంజనేయులు గర్షకుర్తిలో ఒంటరిగా ఉన్న మరదలు మాధవి ఇంటికి ఈనెల 14న రాత్రి వెళ్ళాడు. ఆమెను 12 గుంటల భూమి గురించి నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మెడకు చున్ని బిగించి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఫ్యానుకు చున్నీని కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు.
ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్లి తన భార్యకు జరిగిన ఘటనను వివరించాడు. మళ్లీ ఉదయం గర్షకుర్తికి చేరుకుని మాదవి మృతిపై ఏం తెలియదనట్లు నటించారు. మాధవి మృతిపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కూపీ లాగి అక్క బావలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.