Hyderabad Wine Shops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్..!
Liquor Shops Close in Hyderabad: హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో నగర పోలీసులు ఆదేశాలను జారీ చేశారు.
Wine Shops Closed in Hyderabad City: మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అందింది. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. లాల్ దర్వాజ బోనాల నేపథ్యంలో నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆషాడ మాసం రాకతో హైదరాబాద్ లో బోనాల వేడకుల షురూ అయ్యాయి. ఇందులో భాగంగా… జూలై 28, 29 తేదీల్లో హైదరాబాద్ సిటీలో బోనాల వేడుకలు జరగనున్నాయి. శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు ఉంటాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఆయా రూట్లలో వాహనాలను కూడా మళ్లించనున్ననట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
లాల్ దర్వాజ బోనాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వైన్స్ షాపులు మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు. జూలై 28వ తేదీన(ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ముఖ్యంగా సిటీ సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలిబండ , మీర్‌చౌక్, డబ్బిర్ పుర ప్రాంతాల్లో 28వ తేదీన ఉదయం 6 గంటలనుంచి రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ అవుతాయి. కల్లు దుకాణాలు కూడా తెరుచుకోవు. 30వ తేదీన ఉదయం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయి.
మరోవైపు సౌత్ ఈస్ట్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట , బండ్లగూడ వంటి ప్రాంతాల్లో జులై 28వ తేదీ (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.
ఆషాడ మాసంలో నగర వ్యాప్తంగా బోనాల పండగ జరుగుతోంది. ఎక్కడైతే బోనాలు జరుగుతున్నాయో… ఆయా పరిధిలో ముందస్తుగానే వైన్స్ షాపులను మూసివేయిస్తున్నారు. డ్రై డేలో లిక్కర్ కోనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రెండు రోజులు కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆషాఢమాస బోనాలు…
ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7)వ తేదీన హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ప్రారంభమైంది. మొదటగా గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరిగాయి. రేపు లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు జరగనున్నాయి. తిరిగి గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహిస్తారు. ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.
భాగ్యనగరం బోనాలకు మరో ప్రత్యేకత ఉంది. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది. వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దైవాగ్రహాంతో ఇలా జరుగుతుందని.. ప్రజలు భావించారు. గ్రామ దేవతలను శాంతపరచడానికి ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన పండగే బోనాలు అని చెబుతుంటారు.
1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతోంది. రుతుపవనాలు ప్రవేశించి.. వర్షా కాలం మెుదలుకాగాననే.. మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. వాటితోపాటుగా సీజనల్ అంటువ్యాధులు బాధిస్తాయి.
ఈ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు కూడా సంబంధం ఉంది. వేప ఆకు క్రిమినాశినిగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మహిళలు వేప ఆకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లుతారు. ఇలా బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.