Cyber Crime : పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్-warangal police arrested tamilnadu couple cheating on high profit investments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime : పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్

Cyber Crime : పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 07:11 PM IST

Cyber Crime : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ తమిళనాడుకు చెందిన ఓ కిలాడీ జంట అమాయకులను బురిడీ కొట్టిస్తుంది. తెలంగాణలో 15 నేరాలకు పాల్పడి.. మొత్తంగా రూ. 3 కోట్లకు పైగా వసూలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఈ జంటను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.

పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్
పెట్టుబడుల పేరుతో మోసం, దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన జంట అరెస్ట్ (Pixabay)

Cyber Crime : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ తమిళనాడుకు చెందిన ఓ కిలాడీ జంట అమాయకులను బోల్తా కొట్టించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసి, రూ.కోట్లు వసూలు చేయగా.. చివరకు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం కమిషనరేట్ కాన్పరెన్స్ హాలులో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తాంబరం పట్టణానికి చెందిన 38 ఏళ్ల జసిల్, 32 ఏళ్ల ప్రీతి దంపతులు. ఈజీ మనీ కోసం ఇద్దరూ సైబర్ నేరాలను ఎంచుకున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చు అంటూ వివిధ వెబ్ సైట్ల ద్వారా అమాయకులకు గాలం వేయడం మొదలు పెట్టారు.

రాష్ట్రంలో 15 నేరాలు.. రూ.3 కోట్లకు పైగా వసూలు

ఆన్ లైన్ మోసాలు చేసేందుకు నిర్ణయించుకున్న జసిల్, ప్రీతి దంపతులు.. రెండు ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేశారు. అనంతరం గోల్డ్ మ్యాన్ సచ్, యాంబ్రాండింగ్స్ అనే వెబ్ సైట్ల ద్వారా ప్రచారం చేసుకుని, ఆ తరువాత జనాలతో పెట్టుబడులు పెట్టించేవారు. ఆ డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించి విచ్చలవిడిగా జల్సాలు చేసేవారు. ఇలా దేశ వ్యాప్తంగా 150 వరకు మోసాలకు పాల్పడగా.. వారందరి నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వివిధ స్టేషన్ల పరిధిలో 15 నేరాలకు పాల్పడి.. మొత్తంగా రూ. 3 కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదిలాఉంటే కొద్దిరోజుల కిందట ఇలాగే వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తిని కూడా మోసం చేశారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అంటూ దాదాపు రూ.28 లక్షల వరకు బురిడీ కొట్టించారు. ఈ క్రమంలోనే నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోస పోయినట్లు నిర్ధారించుకున్న బాధితుడు చివరకు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు.

చెన్నైలో చిక్కిన కిలాడీ జంట

తమ వద్ద ఉన్న టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా నిర్ధారించుకున్నారు. అనంతరం వారి లొకేషన్ ను ఐపీ అడ్రస్ ల ద్వారా ఫైండౌట్ చేసి, సైబర్ క్రైమ్ సిబ్బంది తమిళనాడులోని చెన్నై నగరానికి వెళ్లారు. అక్కడ జసిల్, ప్రీతి ఇద్దరినీ అక్కడ సలయూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక జిల్లాలో కోర్టులో హాజరు పరిచి నిందితులను సోమవారం ఉదయం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు తీసుకువచ్చారు. వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డ్స్, చెక్ బుక్స్, పెన్ డ్రైవ్స్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరించారు. ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న జంటను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రవికుమార్‌, ఎస్సైలు చరణ్‌ కుమార్‌, శివ కుమార్‌, ఏఏవో సల్మాన్‌పాషా, కానిస్టేబుళ్లు రాజు, ఆంజనేయులు, దినేష్‌, అనూషను సీపీ అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం