Warangal Crime: ఈజీ మనీ కోసం కొత్త దందా.. లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాల విక్రయం, ఇద్దరు అరెస్ట్-two held for illegal sale of sex determination scanning machines in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime: ఈజీ మనీ కోసం కొత్త దందా.. లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాల విక్రయం, ఇద్దరు అరెస్ట్

Warangal Crime: ఈజీ మనీ కోసం కొత్త దందా.. లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాల విక్రయం, ఇద్దరు అరెస్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 11, 2023 07:27 AM IST

Warangal Crime Latest News: లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్ వెల్లడించారు.

ఇద్దరు నిందితులు అరెస్ట్
ఇద్దరు నిందితులు అరెస్ట్ (twitter)

Warangal Police Commissionerate: లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు వరంగల్ నగర పోలీసులు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా... దందా నడుపుతున్నట్లు గుర్తించారు. కాకతీయ యూనివర్శిటీ, దామెర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో.... నిందితుల వద్ద నుంచి సూమారు 25 లక్షల విలువ చేసే 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లివుడి అశోక్ కుమార్ (34), తాతపూడి కిరణ్ కుమార్(29) ను నిందితులుగా గుర్తించారు. ఈ ఇద్దరు అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) రంగనాథ్ వివరాలు వెల్లడించారు. లింగ నిర్ధారణకు పాల్పడుతూ ఈ మధ్యే అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

టార్గెట్ ఈజీ మనీ...

ఈజీ మనీ కోసం అలవాటుపడి ఈ తరహా దందాకు తెరలేపినట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు. విజయవాడకు చెందిన మల్లివుడి అశోక్‌ కుమార్‌, నెల్లురుకు చెందిన తాతపూడి కిరణ్‌ కుమార్‌ ఈ మార్గం ఎంచుకున్నారని చెప్పారు. " గత నెలలో అక్రమంగా లింగనిర్ధారణకు పాల్పడుతూ అరెస్టు అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్‌ సమాచారం మేరకు.. వీరిద్దరి వ్యవహారం బయటికి వచ్చింది. అశోక్‌ కుమార్‌ విజయవాడలో 2012 సంవత్సరం నుంచి ఎమిలిటీ కన్సల్టెన్సీ సర్వీస్‌ ఇంజినీర్‌ ఈసీజీ, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌కు చెందిన స్కానర్లు మరమ్మతులు చేయడం ద్వారా సంబంధిత డాక్టర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతరం ఆ హాస్పిటల్స్‌ నుంచి పాత స్కానర్లను కోనుగోలు చేయడంతో పాటు చైన్నెలో కూడా పాత స్కానింగ్‌ యంత్రాలను తక్కువ ధరకు కోనుగోలు చేసి వాటికి మరమ్మతులు చేసి ఎక్కువ ధరకు, అర్హతలేని వ్యక్తులకు విక్రయించేవాడు. ఈ క్రమంలో వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో స్కానింగ్‌ యంత్రాల మరమ్మతు చేసే క్రమంలో వేముల ప్రవీణ్‌తో పరిచయమై ఆయనకు అక్రమంగా ఒక స్కానింగ్‌ యంత్రాన్ని విక్రయించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం నిందితుడి నుంచి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న మరో 4 పోర్టబుల్‌, 11 ఫిక్స్‌డ్‌ స్కానింగ్‌ యంత్రాలను కేయూసీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలో అక్రమంగా లింగనిర్ధారణకు పాల్పడుతూ అరెస్ట్‌ అయిన డాక్టర్‌ సబిత సమాచారం మేరకు ఆమెకు అక్రమంగా స్కానింగ్‌ యంత్రాన్ని అమ్మిన మరో నిందితుడు తాతపూడి కిరణ్‌ కుమార్‌ను అరెస్టు చేసినట్లు సీపీ రంగనాథ్ వివరించారు. 2018లో డేవిస్‌ మెడికల్‌ ఎక్యూప్‌మెంట్‌ కంపెనీ సెట్స్‌ మెన్‌గా పనిచేస్తూనే స్కానింగ్‌ యంత్రాల మరమ్మతులు చేయడం నేర్చుకున్నాడు కిరణ్ కుమార్. 2021లో కావలి ప్రాంతంలో శ్రీపవిత్ర టెక్నాలజీశ్రీ పేరుతో స్కానింగ్‌ సర్వీసు సెంటర్‌ ఏర్పాటు చేసి వివిధ హాస్పిటల్స్‌ లోని స్కానింగ్‌ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. హనుమకొండకు వచ్చిపోయే క్రమంలో డాక్టర్‌ సబితతో పరిచయం ఏర్పడి ఆమెకు అనుమతులు లేకుండా రూ. లక్షకు స్కానింగ్‌ యంత్రాన్ని విక్రయించినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇతని నుంచి మరో రెండు పోర్టబుల్‌ , ఒక ఫిక్స్‌డ్‌ స్కానింగ్‌ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.

సెల్ ఫోన్ల చోరీ…

ఉద్యోగంలోంచి తొలగించాడనే నెపంతో అదే షాపు లో సెల్ ఫోన్లోను దొంగిలించిన వ్యక్తిని వరంగల్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 22 లక్షల విలువగల 78ఫోన్లు,2 ల్యాప్ టాప్లు, 2 ట్యాబ్లు, 2స్మార్ట్ వాచ్లు,కారు,స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.