Mlc Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి- ఎమ్మెల్సీ కవిత-warangal news in telugu brs mlc kavitha demands 42 percent reservation to bc sub plan in budget ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి- ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 10:16 PM IST

Mlc Kavitha : రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్​ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలుచేయాలన్నారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : తెలంగాణ బడ్జెట్​ లో బీసీల అభ్యున్నతి కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని మ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. ఫూలే జయంతిలోగా అసెంబ్లీలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ జనగామ జిల్లాకు సర్దార్​ సర్వాయి పాపాన్న పేరు పెట్టాలన్నారు. బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా వరంగల్ నగరంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వరంగల్​ నగరానికి వచ్చిన ఆమెకు స్థానిక జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన రౌండ్​ టేబుల్​సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఆగమాగం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

కర్నాటక హామీనే అమలు చేయలేదు

బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని కవిత గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ఇక్కడి కాంగ్రెస్​ ప్రభుత్వం సాధించిన ముందడుగు ఏమీ లేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్​ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు అవుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఈ మేరకు పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అలాగే బీసీల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్​ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.

జనగామ జిల్లా పేరు మార్చాలి

జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఆవరణలో మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు చేసుకోవచ్చని మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4,365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1,195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని కవిత తెలిపారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారన్నారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, పార్టీ నాయకులు వి.ప్రకాశ్, సుందర్ రాజు యాదవ్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point