Women’s reservation bill: ‘నా భర్త కల’; మహిళా రిజర్వేషన్లపై సోనియా గాంధీ ఉద్వేగం; బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు-sonia gandhi declares support to womens reservation bill ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Sonia Gandhi Declares Support To Women's Reservation Bill

Women’s reservation bill: ‘నా భర్త కల’; మహిళా రిజర్వేషన్లపై సోనియా గాంధీ ఉద్వేగం; బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 02:03 PM IST

Women’s reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం అని ఆమె గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ప్రసంగిస్తున్న సోనియా గాంధీ

Women’s reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ ప్రసంగించారు. బిల్లుకు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, మహిళలకు రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఉండాదలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

అది మా బిల్లు

మహిళా రిజర్వేషన్ బిల్లును ‘మా బిల్లు’అంటూ సోనియాగాంధీ సొంతం చేసుకున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం మాజీ ప్రధాని, తన భర్త రాజీవ్ గాంధీ కృషి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మున్సిపాల్టీల్లో, పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజీవ్ గాంధీ సంకల్పించారన్నారు. ఆ కృషి కారణంగా.. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. ‘‘రాజీవ్ గాంధీ స్వప్నం ఆ విధంగా సగమే సాకరమైంది. ఇప్పుడు లోక్ సభలో, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమైతే రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా సహకారం అవుతుంది’’ అన్నారు.

బిల్లుకు మద్దతు

తన ప్రసంగంలో చట్టసభల్లో విశేష సేవలు అందించిన సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్, అరుణ అసఫ్ అలీ తదితర మహిళా నేతలను సోనియా గాంధీ గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని సోనియాగాంధీ స్పష్టం చేశారు. అయితే ఆ రిజర్వుడ్ సీట్లలో ఓబీసీలకు కూడా కోటా ఇవ్వాలన్నది తమ పార్టీ అభిమాతమని ఆమె వెల్లడించారు. ఈ బిల్లు పాస్ కావడం తన భర్త రాజీవ్ గాంధీ స్వప్నం సాకారం కావడమేనన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఈ ‘నారీశక్తి వందనం అధినియం’ బిల్లుకు మద్దతిస్తుంది. ఈ బిల్లు పాస్ అయితే సంతోషించే వారిలో మేము మొదట ఉంటాం. గత 13 సంవత్సరాలుగా మహిళలు ఈ బిల్లు కోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూశారు. బిల్లులో పేర్కొన్న విషయాలను గమనిస్తే.. వారు ఇప్పుడు మళ్లీ మరి కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? రెండా, మూడా, ఆరా, ఎనిమిదా.. ఇంకా ఎన్ని సంవత్సరాలు?’’ అని సోనియా గాంధీ ఘాటుగా ప్రశ్నించారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు నియోజకవర్గాల పునర్విభజన, జన గణన తర్వాతే సాధ్యమవుతుందని బిల్లులో ఉన్న విషయాన్ని సోనియా ప్రస్తావిస్తూ పై ప్రశ్నలు సంధించారు.

వెంటనే అమలు చేయాలి..

మహిళలకు రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మహిళలకు కూడా ఈ బిల్లులో భాగంగా రిజర్వేషన్ అందాలని ఆమె డిమాండ్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని ఆమె స్పష్టం చేశారు. దీంతో పాటు కుల గణన కూడా చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు అందించే విషయంలో ఇంకా ఏమాత్రం జాప్యం జరిగినా అది మహిళలకు జరిగే అన్యాయమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఈ బిల్లు అత్యంత త్వరగా అమలులోకి రావాలని తమ కోరుకుంటున్నామన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో సోనియా గాంధీది ఇది తొలి ప్రసంగం కావడం విశేషం. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. ‘‘భారత దేశంలోని మహిళలు ఎప్పుడు తమ స్వలాభం కోసమో, స్వార్థం కోసమో పని చేయలేదు. ఇతరుల సంక్షేమం కోసం ఒక నది ఎలా కృషి చేస్తుందో.. అలా అందరికీ ఉపయోగపడేలా మహిళలు పని చేస్తారు. మహిళలకు ఉన్న ఓపికను అర్థం చేసుకోవడం అసాధ్యం. మహిళలు మనల్ని తెలివైన వారిగా, కృషివలురుగా తీర్చిదిద్దారు’’ అని సోనియా గాంధీ ప్రశంసించారు.

స్వాతంత్య్రోద్యమం నుంచి కూడా..

స్వాతంత్ర పోరాటంలో వేలాదిమంది స్త్రీలు పాల్గొన్నారని సోనియా గాంధీ గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం కూడా దేశాభివృద్ధి కోసం ఎంతోమంది కృషి చేశారన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ తదితర నాయకుల ఆశయాలను నిజం చేయడానికి సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్, అరుణ అసఫ్ అలీ తదితరులు ఎంతో కృషి చేశారని సోనియా గాంధీ గుర్తు చేశారు.

WhatsApp channel