TS Caste Census: బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదన్న ఎమ్మెల్సీ కవిత-kavita questioned why bc caste census is not being taken up in the country ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Caste Census: బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదన్న ఎమ్మెల్సీ కవిత

TS Caste Census: బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదన్న ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu
Nov 07, 2023 07:53 AM IST

TS Caste Census: బీసీ కులగణన ఎందుకు చేపట్టడంలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటుందని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

TS Caste Census: కేంద్ర ప్రభుత్వం కులగణన ఎందుకు చేపట్టడం లేదని, ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ ఎందుకు చేయడం లేదని, ఓబీసీ రిజర్వేషన్లను ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న కూడా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే బీసీలపై ఇతర పార్టీలకు ప్రేమ వచ్చిందని, ఎన్నికలు లేనప్పుడు బీసీలపై ప్రేమ చూపించింది ఎవరనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ కి ఎన్నికలు ముఖ్యం కాదని, భావితరాల భవిష్యత్తే సీఎం కెసిఆర్ కి ముఖ్యమని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినంత మంచి పనులు ఏ పార్టీ చేయలేదని అన్నారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని ఎందుకు తొలగించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చే ముందు సమాధానం చెప్పాలని అన్నారు. "బీసీ అధ్యక్షుడిని తొలగించి కొత్తగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు. ఉన్న పదవిని ఊడగొట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని తెలిసి మరీ లేని పదవిని ఇస్తామని చెప్పడమంటే బీసీలను రాజకీయంగా మభ్యపెట్టడమే అన్నారు.

గత ఎన్నికల్లో బిజెపి 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈసారి అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చేస్తారు? బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదం, శుష్క నినాదం, శూన్య నినాదం. అది పనికొచ్చే నినాదం కాదు. " అని స్పష్టం చేశారు.

జనగణన చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కవిత విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఇటువంటి పార్టీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు తొలగిపోవని, తెలంగాణ బీసీలు చైతన్యం కలిగిన వారు కాబట్టి కచ్చితంగా సీఎం కేసీఆర్ కే అండగా నిలబడతారని తేల్చి చెప్పారు.

ఎన్నికలు వచ్చినందునే ఇతర పార్టీలకు బీసీలపై ప్రేమ ఉప్పొంగుతోందని అన్నారు. 2010కి ముందు దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి బీసీ కులగణన చేపట్టారని, కానీ ఇప్పటి వరకు నివేదికను బహీర్గతం చేసే దమ్మూ ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. 2010లో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించిన సమయంలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించలేమని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

కులగణన అంటేనే ఒక అంటరాని అంశంగా బీజేపీ భావిస్తోందని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకొని అన్ని వర్గాలకు అవసరమైన పనులను చేస్తున్నారని చెప్పారు.

బీసీ కులగణన ఎందుకు చేపట్టలేకపోతున్నదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. జాతీయ బీసీ కమిషన్ ను నిర్వీర్యం చేయడం సరికాదని సూచించారు.

2004లోనే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో ను తీసుకొని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారని, 20 ఏళ్లు గడిచినా కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, విశ్వవిద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకపోవడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం కులవృత్తులకు చేయుత ఇవ్వకుండా వారి బీసీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని అడిగారు.

బీసీల పట్ల కేంద్రం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయిందని నిప్పులు చెరిగారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల్లో ఎంత మంది బీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ న్యాయమూర్తలు ప్రాతినిధ్యం పెంచడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని స్పష్టం చేశారు. తమది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, బీసీల ప్రభుత్వమని తెలిపారు. బీసీల అభ్యున్నత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

Whats_app_banner