Kalvakuntla Kavitha : స్పీడ్ పెంచిన ఎమ్మెల్సీ కవిత, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై!
Kalvakuntla Kavitha : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కవిత యాక్టివ్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై నిలదీస్తున్నారు.
Kalvakuntla Kavitha : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉంటున్నారు. ఓ సారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, మరోసారి కార్యకర్తలను కలుస్తూ మీడియా ఫోకస్ తనపై ఉండేలా చేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో సమీక్షా సమావేశంలో సొంత నాయకుల తీరుపై విమర్శలు గుప్పించి సంచలనం లేపారు. ఇదే సమయంలో ఈడీ నోటీసులు రావడం, హాజరుకాలేనని కవిత సమాధానం ఇవ్వడం కూడా రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. నిజామాబాద్ లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న కవిత.. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని రాజకీయ టాక్.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ?
గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమిపాలైన విషయం తెలిసిందే. నాడు పసుపు రైతుల వ్యతిరేకతతో ఓటమి చెందారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్న కవిత.. అందులో భాగంగా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. కవిత ప్రచారం నిర్వహించిన కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటమి పాలయ్యారు. బాల్కొండలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. కానీ మిగిలిన చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయినప్పటికీ.. కవిత తనదైన శైలిలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వారం నుంచే విమర్శలు ఎక్కు పెట్టారు. ముఖ్యంగా సింగరేణి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పోటీకి విముఖత చూపినప్పటికీ.. కవిత చొరవతోనే చివరి నిమిషంలో పోటీకి దిగారన్నది తెలిసిందే. ఇక గవర్నర్ ప్రసంగంపై కూడా కవిత అభ్యంతరాలు తెలియజేశారు. ఇక 200 యూనిట్లలోపు కరెంటు బిల్లులు మాఫీ చేయాలని, ప్రజలు ఈ బిల్లులు చెల్లించకూడదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాజాగా కేటీఆర్ ప్రస్తావించారు.
ప్రభుత్వ హామీలపై నిలదీస్తున్న కవిత
రైతుబంధు నగదు జమలో ఆలస్యం, ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ సర్కారుపై మాట్లాడేందుకు జంకుతున్న సమయంలో కవిత మాత్రం తనదైన శైలిలో దాడి చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికలు సైతం కేవలం కవిత ఛరిష్మాతోనే గెలుస్తామని ఆమె అనుచరులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ నాయకులపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు సైతం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఓటమిపై జిల్లాలో ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చింది మాట్లాడలేదు. కవిత మాత్రం ప్రభుత్వ హామీలపై నిలదీస్తున్నారు. ఇక తాజాగా స్పీకర్ ను కలిసి అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని విన్నవించడం విశేషం.
రిపోర్టింగ్ : ఎమ్.భాస్కర్, నిజామాబాద్