WADRA : హైడ్రా తరహాలోనే వరంగల్ కు 'వాడ్రా'..! సిద్ధమవుతున్న యాక్షన్ ప్లాన్-wadra is likely to be set up like hydra to protect ponds in warangal city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Wadra : హైడ్రా తరహాలోనే వరంగల్ కు 'వాడ్రా'..! సిద్ధమవుతున్న యాక్షన్ ప్లాన్

WADRA : హైడ్రా తరహాలోనే వరంగల్ కు 'వాడ్రా'..! సిద్ధమవుతున్న యాక్షన్ ప్లాన్

HT Telugu Desk HT Telugu
Aug 25, 2024 07:21 AM IST

వరంగల్ నగరంలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. నగరంలో ఉన్న చెరువులను కాపాడే ఉద్దేశ్యంతో వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అథారిటీ(వాడ్రా)ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. . తొందర్లోనే ‘వాడ్రా’ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వరంగల్ నగరంలో త్వరలోనే హైడ్రా తరహా వ్యవస్థ...!
వరంగల్ నగరంలో త్వరలోనే హైడ్రా తరహా వ్యవస్థ...!

హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటు తరహాలో వరంగల్ లో చెరువుల రక్షణకు ప్రభుత్వం ‘వాడ్రా’ ఏర్పడబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అథారిటీ) ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తుండగా, అదే తరహా వ్యవస్థను వరంగల్ లోనూ వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అథారిటీ(వాడ్రా)ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఓ సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. హైడ్రా మాదిరిగానే వరంగల్ లో వాడ్రా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా ఇప్పటికే వరంగల్ చుట్టూరా ఉన్న గొలుసుకట్టు చెరువులు, కుంటలు చాలా వరకు ఆక్రమణకు గురి కాగా, తొందర్లోనే వాడ్రాను ఏర్పాటు చేసి, అక్రమ నిర్మాణాలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

డీసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు

హైదరాబాద్ లో ఏర్పాటైన హైడ్రాకు కమిషనర్ గా ఐజీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన తనదైన శైలిలో దూసుకెళ్తుండగా.. అదే తీరుగా వరంగల్ లో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వాడ్రా పర్యవేక్షణకు డీసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించగా.. తొందర్లోనే వాడ్రా కార్యరూపం దాల్చనుందనే విషయం స్పష్టం అవుతోంది.

వరంగల్ లో ఉన్న పరిస్థితిని ఇప్పటికే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. పైనుంచి కూడా సానుకూల స్పందనే వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వాడ్రా ఏర్పాటు విషయం వరంగల్ లో తీవ్ర ప్రచారం జరగగా.. సాధ్యమైనంత తొందర్లోనే వాడ్రాను ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆక్రమణలో గొలుసుకట్టు చెరువులు

ఓరుగల్లు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయులు సాగు, తాగు నీటి అవసరాల కోసం అప్పట్లో నగరం చుట్టూరా గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేశారు. మొత్తంగా 250కిపైగా చెరువులు, కుంటలు ఏర్పాటు చేయగా, అందులో దాదాపు 55 చెరువులు, కుంటలు కనుమరుగయ్యాయి.

రోజురోజుకు భూములకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది రియల్టర్లు, భూకబ్జాదారులు పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో ఎక్కడికక్కడ శిఖం భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో చెరువుల గొలుసుకట్టు తెగిపోయి వర్షాలు పడినప్పుడల్లా వరద నీళ్లు కాలనీల్లోకి పరుగులు తీస్తున్నాయి. 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం సగం వరకు నీట మునగగా.. చెరువుల గొలుసుకట్టు తెగిపోవడం, నాలాల ఆక్రమణల పాపం వల్లే ముంపు సమస్య తలెత్తినట్లు అధికారులు కూడా నిర్ధారించారు.

అనంతరం ఆక్రమణలు తొలగిస్తామని అప్పటి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చి, హడావుడిగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఆ తరువాత లైట్ తీసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలు ఇప్పటికీ ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి.

ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణాలు

వరంగల్ నగరంలోని చాలా చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పరిధిలోనే అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రధానంగా భద్రకాళి చెరువు, కాజీపేట బంధం చెరువు, ములుగురోడ్డులోని కోట చెరువు, గోపాలపూర్ ఊర చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, బెస్తం చెరువు, రంగ సముద్రం, భీమారం శ్యామల చెరువు, దేవన్నపేట బంధం చెరువు, కోమటిపల్లి గవ్వం చెరువు, హసన్ పర్తి చెన్నంగి చెరువు... ఇలా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని చాలా చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురి కావడంతో పాటు వాటిలోనే పెద్ద పెద్ద బిల్డింగులు ఏర్పాటయ్యాయి.

ఈ నేపథ్యంలోనే రెండు నెలల కిందట వరంగల్ మున్సిపల్ అధికారులు దాదాపు 376 మందికి నోటీసులు జారీ చేశారు. రెండు, మూడు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేశారు. కానీ ఆ తరువాత పొలిటికల్ లీడర్ల ఎంట్రీతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మళ్లీ వెనక్కి వెళ్లింది.

వాడ్రా ఏర్పాటు చేయాలని డిమాండ్లు

హైదరాబాద్ లో హైడ్రా సత్తా చాటుతుండటంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల రక్షణకు వాడ్రా ఏర్పాటు చేయాలని ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పర్యావరణ ప్రేమికులు, చెరువులు, కుంటల పరిరక్షణ సమితి సభ్యులు కూడా వాడ్రా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొంతమంది తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ‘వాడ్రా’ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో జనాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఓరుగల్లు చెరువులను రక్షించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి వాడ్రా ఏర్పాటు విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం

టాపిక్