HYDRA : హడలెత్తిస్తున్న 'హైడ్రా' అస్త్రం..! అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా..?
'హైడ్రా'.. ఇప్పుడు దీనిచుట్టే చర్చ అంతా..! ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే దూకుడుగా ముందుకెళ్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను బుల్డోజ్ చేసే పనిలో పడింది. పాత, కొత్త అనే తేడా లేకుండా... కబ్జా అని తేలితే చాలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. అసలు హైడ్రా ఏంటి..? విధివిధానాలెంటో చూద్దాం..!
HYDRA : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 'హైడ్రా'..హడలెత్తిస్తోంది..! అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రికార్డులు బయటికి తీస్తూ.... అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది.
సామాన్యులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా 'హైడ్రా' కఠినంగా వ్యవహారిస్తోందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్ - కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందటంతో... నేరుగా సీన్ లోకి వెళ్లింది. గంటల వ్యవధిలోనే అక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది. ఈ చర్యలతో 'హైడ్రా'పై డిస్కషన్ మరో లెవల్ కి వెళ్లిపోయింది.
అసలు హైడ్రా ఏంటి..?
హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి... ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించి ఉంటుంది.
ఛైర్మన్ గా ముఖ్యమంత్రి...
హైడ్రా కు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు.
కమిషనర్ గా ఏవీ రంగనాథ్..
హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఏవీ రంగనాథ్ కు మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ సీపీగా, హైదరాబాద్ వివిధ హోదాల్లో పని చేశారు. ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సీపీగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు. ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిడి పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
హైడ్రా ఏం చేస్తుంది..?
విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూడా చర్చకు వస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా... మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝలిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటిని పరిశీలిస్తోంది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది...? ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పెట్టుకుంది. ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిజానికి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిల్లో కొన్నింటిని గుర్తించి ప్రభుత్వం స్వాధినం చేసుకుంది. అయితే.. తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టాడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదు.
అక్రమ నిర్మాణాలకు పరిష్మన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే చాలా మంది అధికారుల బాగోతం బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా.. ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తుందా..? లేక ఏమైనా అడ్డంకులతో స్లో అవుతుందా..? అనేది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది..!
సంబంధిత కథనం