Congress Report On GO 111 : రియాల్టర్ల కోసమే 111 జీవో రద్దు, ఎఫ్టీఎల్ పరిధిలో హరీశ్ రావు ఫాంహౌస్
Congress Report On GO 111 : జీవో 111 రద్దుపై కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ నివేదిక రూపొందించింది. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫాంహౌస్ లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందుకే హిమాయత్ సాగర్ నిండక ముందే గేట్లు లిఫ్ట్ చేస్తున్నారని నివేదికలో పేర్కొంది.
Congress Report On GO 111 : 111 జీవో ఎత్తివేయడంపై ఓ రిపోర్ట్ తయారు చేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇచ్చామని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. 111 జీవో పరిధిలో 80 శాతం భూములు రియాల్టర్ల చేతిలో ఉందన్నారు. పర్యావరణంపై సీఎం కేసీఆర్ కు అవగాహన లేదని ఆరోపించారు. జంట జలాశయాల నిర్మాణం వెనక కారణం బీఆర్ఎస్ కు తెలియదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రులు ఫాంహౌస్ లు కట్టుకున్నారని తెలిపారు. హిమాయత్ సాగర్ పూర్తిగా నిండక ముందే మంత్రుల ఫాంహౌస్ లు మునగకుండా ఉండేందుకు గేట్లు తెరిచారన్నారు. కేటీఆర్ అవగాహన రాహిత్యం వల్ల జంట జలాశయాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రియాల్టర్ల కోసమే 111జీవో ఎత్తివేశారన్నారు. మంత్రి హరీశ్ రావుతో పాటు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫాంహౌస్ లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. 111 జీవో పరిధిలో సామాన్య ప్రజలకే అన్నీ కండీషన్స్. పెద్ద వారు మాత్రం ఇష్టారీతిలో ఇళ్లను కడుతున్నారని తెలిపారు. ఓఆర్ఆర్ లీజులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే.. మంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
జీవో 111 రద్దు
111 జీవో రద్దుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 84 గ్రామాల పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలు తొలగించారు. పర్యావరణ వేత్తలు, ప్రజాసంఘాలతో పాటు పలు పార్టీలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి. కేవలం రియల్ దందా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. నిజాం పాలకుల సమయంలో జంట జలాశయాలు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిర్మించారు. హైదరాబాద్ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీరు అందించేవారు. అవి లేకుంటే.. హైదరాబాద్ నగరానికి కష్టంగా ఉండేదేమో. ఇలాంటి ముఖ్యమైన జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో.. 1996లో 111 జీవోను తెచ్చింది అప్పటి ప్రభుత్వం. జలాశయాల్లో నీటి కలుషితం చేయకుండా ఉండటం దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి 1994లో జీవో 192 తీసుకొచ్చారు. గండిపేట చెరువు దగ్గరలో ఓ రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయడంతో.. జీవోను తెచ్చారు. అయితే.., మళ్లీ 1996లో సవరించి జీవో 111గా ఛేంజ్ చేశారు. అలా జీవోలో అనేక నిబంధనలు పెట్టారు.
ఓఆర్ఆర్ టెండర్లపై హైకోర్టులో పిటిషన్
ఓఆర్ఆర్ టెండర్ల సమాచారాన్ని సీక్రెట్ ఉంచుతున్నారని, ఆర్టీఐ ద్వారా వివరాలు ఇవ్వడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఆర్ఆర్లీజు టెండర్లలో అక్రమాలు జరిగాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. టెండర్ల వివరాల కోసం ఆర్టీఐ వేస్తే సమాచారం ఇవ్వడంలేదన్నారు. ఆర్టీఐకి కమిషనర్లు లేకపోవడంతోనే సమాచారం ఇవ్వడంలేదని పిటిషన్లో పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటుందని రేవంత్ఆరోపించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజ్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఓఆర్ఆర్ లీజులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు.