Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!-veeragallu of the rashtrakuta era was found in siddipet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!

Siddipet District : అప్పాలయచెరువులో 'వీరగల్లు' లభ్యం - రాష్ట్రకూటుల కాలం నాటిదిగా గుర్తింపు..!

HT Telugu Desk HT Telugu
Aug 23, 2024 10:10 PM IST

సిద్ధిపేట జిల్లాలోని అప్పాలయచెరువు గ్రామంలో రాష్ట్రకూటుల కాలం నాటి వీరగల్లు లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వివరించారు.

లభ్యమైన వీరగల్లు
లభ్యమైన వీరగల్లు

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అప్పాలయ చెరువు గ్రామంలో రాష్ట్రకూటుల కాలం నాటి వీరగల్లు లభ్యమైంది. ఇందుకు సంబంధించిన విషయాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వెల్లడించారు.

ఈ వీరగల్లులో ప్రధాన వీరుడు అశ్వారూఢుడై (గుర్రం పై కూర్చొని) బూమరాంగ్ వంటి వంపు కత్తి ధరించి ఉన్నాడు. నడి నెత్తిన కొప్పు కత్తి ఉందని, ఇదే రాష్ట్రకూటుల కాలం నాటి వీరగల్లు అనడానికి ఆధారమని ఆయన తెలిపారు. ఈ వీరగల్లు విగ్రహాన్ని పరిశీలిస్తే అతని కుడిచేయి పక్కన ధ్యానాసన స్థితిలో గురువు ఉందని చెప్పారు. ఎడమ చేతితో గుర్రపు కళ్ళెం పట్టుకున్నాడని వివరించారు.

ఇందులో చెట్టు, దానిపై రెండు పిట్టలు, రెండు ఎద్దులు, వేట కుక్కలు, అడవి పందులు, గుర్రం బొమ్మలు, స్త్రీ దేవత మూర్తి, రాజ భటుల విగ్రహాలు, చెక్కబడి ఉన్నాయి. ఒకే రాతిపై వివిధ రూపాలు చెక్కబడి కనిపించడం ఆనాటి శిల్పి ప్రతిభకు నిదర్శనమని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు శ్రీనివాస్ అన్నారు.

భవిష్యత్తు తరాలకు తెలిసేలా.....

తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు తెలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. మరోవైపు నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం రామంతాపూర్ గ్రామ శివారులో రామేశ్వర గుట్టపై క్రీ. పూ వెయ్యేళ్ళ నాటి ఇనుప యుగపు కట్టడాలు, ఆనవాళ్లు కోల్పోతున్నాయని పురావస్తు పరిశోధకుడు శివ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికుల సమాచారంతో ఇనుప యుగపు సమాధులను శివ నాగిరెడ్డి పరిశీలించారు. అవి క్వారీ పనుల్లో కొన్ని ద్వంసం అయ్యాయని, మిగిలిన ఒక కట్టడం ప్రమాదపుటంచున ఉందని చెప్పారు. వేల ఏళ్లనాటి ప్రజల సామూహిక శ్రమకు,నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా ఉన్న దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శివ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

Whats_app_banner