TSPSC Group 4 : గ్రూప్ - 4 లో తగ్గిన 1,129 పోస్టులు.. కోత ఎందుకంటే.. ?-tspsc reduced 1129 posts in group notification these are the details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 : గ్రూప్ - 4 లో తగ్గిన 1,129 పోస్టులు.. కోత ఎందుకంటే.. ?

TSPSC Group 4 : గ్రూప్ - 4 లో తగ్గిన 1,129 పోస్టులు.. కోత ఎందుకంటే.. ?

HT Telugu Desk HT Telugu
Dec 31, 2022 04:27 PM IST

TSPSC Group 4 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ - 4 ఆశావాహులకు షాక్ ఇచ్చింది. సమగ్ర నోటిఫికేషన్ లో 1,129 పోస్టులు తగ్గించింది. ఇప్పటికే మొదలైన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. జనవరి 30, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4
టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4

TSPSC Group 4: గ్రూప్ - 4 ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది మంది ఆశావాహులకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) షాక్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టులతో డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత ప్రకటించింది. అయితే.. సాంకేతిక కారణాలు, వివిధ శాఖల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా దరఖాస్తుల స్వీకరణను డిసెంబర్ 30 కి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం నుంచి అప్లికేషన్ లింక్ అందుబాటులోకి వస్తుందని అభ్యర్థులు ఎదురు చూశారు. అయితే.. అర్ధరాత్రి తర్వాత దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ.. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ ను వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చింది.

తొలుత ప్రకటించిన 9,168 ఖాళీలు కాకుండా.. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో 8,039 ఖాళీలనే భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ప్రకటన కన్నా.. 1,129 పోస్టులు తగ్గించి చూపించింది. ప్రాథమిక నోటిఫికేషన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,245 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.... సమగ్ర నోటిఫికేషన్ లో మాత్రం.. 37 పోస్టులనే పేర్కొంది. తద్వారా ఈ ఒక్క శాఖలోనే 1,208 పోస్టులు తగ్గించినట్లైంది. మరికొన్ని శాఖల్లో అంతకముందు పేర్కొన్న దాని కన్నా.. 79 ఖాళీలు ఎక్కువగా చూపించింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఖాళీల వివరాలు, రోస్టర్ సమాచారం ఇంకా అందని కారణంగానే.. సమగ్ర నోటిఫికేషన్ లో గ్రూప్ 4 పోస్టుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై టీఎస్పీఎస్సీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఖాళీల వివరాలు అందిన తర్వాత అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తుందా ? లేక తదుపరి నోటిఫికేషన్ కు వాటిని ఫార్వర్డ్ చేస్తుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

గ్రూప్ 4 పోస్టుల కోసం డిసెంబర్ 30న అర్ధరాత్రి మొదలైన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. జనవరి 30, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పరీక్షలను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని.. వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఓటీఆర్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని.. పోస్టులకి సంబంధించిన అర్హతలు, వయసు, రోస్టర్, జిల్లా వారీగా ఖాళీల వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది.

2022 లోనే ప్రధాన నోటిఫికేషన్లన్నీ జారీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ డిసెంబర్ 29న గ్రూప్ - 2 నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 శాఖల్లో 783 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

Whats_app_banner