TSPSC Jobs In December : డిసెంబర్లో గుడ్ న్యూస్.. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు
TSPSC Job Notification : తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్ల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. డిసెంబర్ నెలలో మరికొన్ని నోటిఫికేషన్లు రానున్నాయి.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు టీఎస్పీఎస్సీ(TSPSC) సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. డిసెంబర్లో(December) మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్ 2లో 726, గ్రూప్ 3లో 1,373, గ్రూప్ 4లో 9,168 ఖాళీలను భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ నెలలో నోటిఫికేషన్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
రిక్రూట్‌మెంట్(Recruitment)కు ఆర్థిక శాఖ అనుమతితో డిసెంబర్ నెలలో పోస్టులకు నోటిఫికేషన్(Notification) రానుంది. జీఓ నెం.55కి చేసిన సవరణ ప్రకారం గ్రూప్-2లో కొత్తగా ఆరు పోస్టులు, గ్రూప్-3(Group 3) సర్వీసుల్లో రెండు కేటగిరీల పోస్టులు, గ్రూప్-IV సర్వీసుల్లో నాలుగు కేటగిరీల పోస్టులు చేర్చారు.
గ్రూప్ 2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(Tribal Welfare), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు సైతం ఉండనున్నాయి. మరోవైపు గ్రూప్ 3లో గిరిజన సంక్షేమ శాక అకౌంటెంట్, హెచ్ఓడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు చేర్చింది. గ్రూప్ 4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్(Junior Assistant), అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు కూడా చేరాయి. గతంలో గ్రూప్ 2లో 663 పోస్టులకు అనుమతి ఇచ్చారు. తాజాగా చేర్పులతో ఆ సంఖ్య 726కి వచ్చింది. గ్రూప్ 3లో సైతం పోస్టుల సంఖ్య పెరగనుంది.
నోటిఫికేషన్ జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీఎస్పీఎఎస్సీ(TSPSC) కసరత్తు చేస్తోంది. నియామకాలను ప్రారంభించడం, వివిధ శాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. గ్రూప్ IV రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి సుమారు 30 విభాగాలతో TSPSC ఛైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ సోమవారం సమావేశమయ్యారు. ఈ లెక్కన డిసెంబర్ నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటివరకు, రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటించిన మెుత్తం 80,039 ఖాళీలలో 61,804 ఖాళీలకు రిక్రూట్‌మెంట్ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన 18,235 ఖాళీలకు కూడా త్వరలో క్లియరెన్స్ లభిస్తుంది. మెుత్తం 94 శాఖల అధికారులతో దశల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రూప్ 2, 3, 4కు సంబంధించి.. ఖాళీలు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై చర్చిస్తారు.