TSPSC AE Exam Cancelled : పేపర్ లీకేజ్ ఎఫెక్ట్... అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు
TSPSC AE Exam 2023: ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
TSPSC AE Exam 2023 Cancelled : ఏఈ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
పేపర్ లీక్… ఏం జరిగిందంటే..?
టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసును సిట్ పర్యవేక్షిస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్పీ (TSPSC)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి ఉపాధ్యాయురాలు రేణుకతో స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్(Assistant Engineer) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కావాలని రేణుక ప్రవీణ్ ను అడిగింది. భర్త ఢాక్యా నాయక్ తో కలిసి డీల్ చేసిన రేణుక... రూ. 10 లక్షలు ఇస్తామని ప్రవీణ్ కి చెప్పింది. దీంతో.. అతడు టీఎస్పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్ వర్డ్ ని తస్కరించారు. టీఎస్పీఎస్సీలో అన్ని కంప్యూటర్లు ఒకే ల్యాన్ కింద కనెక్ట్ అయి ఉండటంతో.. సర్వర్ లో పాస్ వర్డ్ టైప్ చేసి ప్రశ్నపత్రాలు యాక్సెస్ చేశారు. ఆ తర్వాత వాటిని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్న ప్రవీణ్.... రేణుకకి ఇచ్చాడు. ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు.
రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్... అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో డీల్ సెట్ చేసేందుకు సహకరించాడు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ని సంప్రదించారు. డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునేందుకు నిరాకరించిన శ్రీనివాస్... తనకు తెలిసిన వారితో డీల్ కుదిరేలా చేశాడు. ఈ క్రమంలోనే దినేశ్ నాయక్ , గోపాల్ నాయక్ సహా మరో ఇద్దరు అభ్యర్థులకి పేపర్ ఇచ్చారు. ఇలా రూ. 13.5 లక్షలు సేకరించారు. వీరందరూ రేణుక ఇంట్లోనే ప్రశ్నలపై అధ్యయనం చేసి సమాధానాలు సేకరించారు. అనంతరం మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష(Exam)కు హాజరయ్యారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పూర్తవడంతో.. ఇదే పంథాలో టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా ఇంటి దొంగలు లీక్ చేసినట్లు సమాచారం.
మార్చి 11న టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయాలన్నీ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించి పేపర్లు లీక్ అయ్యాయన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ ఫిర్యాదు చేయగా... తాము దర్యాప్తు చేశామని, ఈ క్రమంలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని గుర్తించామని చెప్పారు. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నామని... గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సుమారు 2 గంటలపాటు సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని నేర విభాగ అదనపు సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రథమం అయిన ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ దొంగలించారని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ నుంచే ప్రతి పేపర్ వివరాలను తెలుసుకుని.. వాటిని దొంగలించారని తేల్చారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ సాయంతోనే ప్రశ్నాపత్రాలను నిందితుడు ప్రవీణ్ కాపీ చేసినట్లు అధికారులు కనుగొన్నారు.