SSC PaperLeak: పదో తరగతి విద్యార్ధి డిబార్.. లబోదిబోమంటున్న విద్యార్ధి
SSC PaperLeak: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్ చేశారనే ఆరోపణలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు.మరోవైపు ప్రశ్నాపత్రాల లీక్‌కు కారకుడైన విద్యార్ధిని డిబార్ చేయడంతో లబోదిబోమంటున్నాడు.
SSC PaperLeak: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో ఓ విద్యార్ధిని అధికారులు డిబార్ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు కారకుడిగా ఓ విద్యార్ధిని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు.
అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తనను అయిదేళ్ల పాటు డిబార్ చేయడం అన్యాయమని విద్యార్థి బోరున విలపించాడు. హిందీ ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హనుమకొండ కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. గురువారం కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు.
పరీక్షరాయడానికి వచ్చిన విద్యార్ధిని హనుమకొండ డీఈవో పిలిచి 'నీ క్వశ్చన్ పేపర్ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపారు. పరీక్ష కేంద్రం బయట ఆ విద్యార్థి బోరున విలపించాడు. తన హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలపించాడు. బుధవారం ‘పరీక్ష కేంద్రంలో మొదటి ఫ్లోర్‌లో మూడో నంబర్ గదిలో కిటికీ దగ్గర కూర్చుని హిందీ పరీక్ష రాస్తుంటే, గోడ మీది నుంచి వచ్చిన ఓ బాలుడు.. ప్రశ్నపత్రం ఇవ్వాలని, బెదిరించాడని వివరించాడు. తాను ఇవ్వకపోయిన కిటికీ నుంచి లాక్కొని సెల్ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు.
విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు సదరు విద్యార్థిని డిబార్ చేస్తున్నట్లు డీఈవో అబ్దుల్ హై తెలిపారు. తనకు ఏ పాపం తెలియదని పరీక్షా కేంద్రంలో జవాబు పత్రాన్ని ఫోల్డ్ చేసుకుంటా ఉంటే కిటికీ వద్దకు వచ్చిన వ్యక్తి బెదిరించి హిందీ ప్రశ్నపత్రం తీసుకొని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడని చెప్పాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడని విద్యార్ధి వాపోయాడు. కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వస్తే ఎవరో చేసిన తప్పునకు తాను బలయ్యానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు తనకొడుకు జీవితం నాశనమైందని విద్యార్ధి తల్లి వాపోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు రాసేందుకు తన కొడుకును అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు.
మరోవైపు తెలంగాణలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సప్‌లో బయటకు పంపిన తాండూరు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. బందెప్ప జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, ఆ రోజు వాళ్ల సెల్‌ఫోన్ల నుంచి ప్రశ్న పత్రం ఎవరెవరికి వెళ్లింది? వాళ్లతో ఎవరెవరు మాట్లాడారు? అనే అంశాలపై విచారిస్తున్నామన్నారు.