Sagar Special Buses : 'సాగర్' అందాలను చూసొద్దామా..! తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, వివరాలివే-tgsrtc to operate special buses to nagarjuna sagar from hyderabad full details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sagar Special Buses : 'సాగర్' అందాలను చూసొద్దామా..! తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, వివరాలివే

Sagar Special Buses : 'సాగర్' అందాలను చూసొద్దామా..! తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 14, 2024 12:10 PM IST

కృష్ణమ్మ పరుగులతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ఇటీవలే వరద తగ్గటంతో గేట్లను మూసివేశారు. అయితే సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి సాగర్ కు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో) (image source from Twitter)

ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణమ్మ పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇటీవలే శ్రీశైలం, సాగర్ గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పర్యాటకులు భారీగా తరలివెళ్లారు.

నగరం నుంచి ప్రత్యేక బస్సులు

ప్రస్తుతం వరద తగ్గటంతో గేట్లను మూసివేశారు. అయినప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతంలోని అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ సాగర్ కు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తోంది.

హైదరాబాద్ నగరానికి సాగర్ సమీపంలో ఉండటంతో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా ఘాట్ రోడ్డు వంటి ఇబ్బందులు కూడా లేకపోవటంతో సాఫీగా జర్నీ సాగిపోతుంది.

ఇక తెలంగాణ ఆర్టీసీ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి నేరుగా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ఉదయం 5, 6.45, 7. 15, 7.30, 8, 9.45, 10.45 నిమిషాలకు బస్సులు బయల్దేరుతున్నాయి.

ఇక మధ్యాహ్నం 2.30, సాయంత్రం 5 గంటలతో పాటు 5.40 గంటలకు డీలక్స్ బస్సులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి నేరుగా నాగార్జున సాగర్‌కు బయల్దేరుతున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే సందర్శకులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

తెలంగాణ టూరిజం ప్యాకేజీ:

మరోవైపు నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు.

'Nagarjuna sagar Tour - Telangana Tourism' పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు. ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఇదే బస్సు 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.

ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సంద‌ర్శ‌ిస్తారు.

ఇక సాయంత్రం 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800గా నిర్ణయించింది. ఇక చిన్న పిల్లలకు చూస్తే రూ. 640గా ఉంది. https://tourism.telangana.gov.in/home  వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సాగర్ టూర్ ప్యాకేజీ కోసం https://tourism.telangana.gov.in/package/nagarjunasagartour  లింక్ పై క్లిక్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో సూచించిన ఫోన్ నెంబర్లు లేదా మెయిల్ ను సంప్రదించవచ్చు.

Whats_app_banner