Telangana Tourism : వీకెండ్ లో 'సాగర్‌ ' ట్రిప్ - రూ. 800కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!-telangana tourism operate nagarjuna sagar tour package from hyderabad city latest details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tourism : వీకెండ్ లో 'సాగర్‌ ' ట్రిప్ - రూ. 800కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!

Telangana Tourism : వీకెండ్ లో 'సాగర్‌ ' ట్రిప్ - రూ. 800కే వన్ డే టూర్ ప్యాకేజీ, వీటన్నింటిని చూడొచ్చు...!

Nagarjuna Sagar Tour Package: కృష్ణమ్మ పరుగులతో సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తారు. దీంతో టూరిస్టులు భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టును చూసేందుకు తరలివెళ్తున్నారు. అయితే మీరు కూడా వీకెండ్ లో సాగర్ చూడాలనుకుంటే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

నాగార్జున సాగర్

Telangana Tourism Nagarjuna Sagar Tour: నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు.

'Nagarjuna sagar Tour - Telangana Tourism' పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు. ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఇదే బస్సు 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.

ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సంద‌ర్శ‌ిస్తారు.

ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉద్ధృతి ఉండటంతో రెండు రోజుల కిందటే సాగర్ గేట్లు ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్ లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. రాత్రి వేళలో లైట్ల మధ్య సాగర్ ప్రాజెక్ట్ సరికొత్త అందాలను సంతరించుకుంది. గేట్లు ఎత్తిన రోజు నుంచే పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు.

ఇక సాయంత్రం 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800గా నిర్ణయించింది. ఇక చిన్న పిల్లలకు చూస్తే రూ. 640గా ఉంది. https://tourism.telangana.gov.in/home వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సాగర్ టూర్ ప్యాకేజీ కోసం https://tourism.telangana.gov.in/package/nagarjunasagartour లింక్ పై క్లిక్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో సూచించిన ఫోన్ నెంబర్లు లేదా మెయిల్ ను సంప్రదించవచ్చు.