Old City Metro Rail : పాతబస్తీకి మెట్రో పరుగులు, ఎంజీబీఎస్-ఫలక్ నుమా మధ్య 5 స్టేషన్లు!-hyderabad metro rail extension to old city mgbs falaknuma five metro stations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Old City Metro Rail : పాతబస్తీకి మెట్రో పరుగులు, ఎంజీబీఎస్-ఫలక్ నుమా మధ్య 5 స్టేషన్లు!

Old City Metro Rail : పాతబస్తీకి మెట్రో పరుగులు, ఎంజీబీఎస్-ఫలక్ నుమా మధ్య 5 స్టేషన్లు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 16, 2023 09:53 PM IST

Old City Metro Rail : హైదరబాద్ పాతబస్తీకి మెట్రో రైలు విస్తరణపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.

హైదరబాద్ మెట్రో
హైదరబాద్ మెట్రో

Old City Metro Rail : పాతబస్తీకి మెట్రో సేవలు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో మెట్రో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మధ్య మెట్రో రైలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. నెలరోజుల్లో భూసేకరణకు నోటీసులు జారీ చేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్ లో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, మెట్రో విస్తరణలో భాగంగా వీటిని తొలగించాల్సి ఉందన్నారు. ఎక్కువగా కట్టడాలను కూల్చకుండా 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేసి ఈ మార్గంలో మెట్రో పనులు ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.

ఐదు మెట్రో స్టేషన్లు

పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కసరత్తు చేపట్టింది. గతంలో భూసేకరణలో సమస్యలు రావడంతో ఎంజీబీఎస్-ఫలక్ నుమా మధ్య మెట్లో విస్తరణ నిలిచిపోయింది. అయితే తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మెట్రో రైలు విస్తరణకు హెచ్ఎంఆర్ఎల్ కార్యచరణ సిద్ధం చేసింది. పాతబస్తీలో మెట్రో రైలు మార్గంలో మొత్తం 5 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, వీటిలో 4 నిర్మాణాల విషయంలో సమస్యలు వచ్చాయన్నారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరిస్తామవుతాయన్నారు.

5.5 కిలోమీటర్ల మార్గం

ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైలు తొలివిడతలో 69.2 కిలోమీటర్లు మేర మెట్రో రైలు మార్గాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించింది. అయితే పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఈ మార్గంలో మతపర కట్టడాలు ఎక్కువ ఉండడం, భూసేకరణలో సమస్యలు రావడంతో ఎల్ అండ్ టీ అప్పుడు చేతులెత్తేసింది. సుమారు ఆరేడు సంవత్సరాలుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది. మతపరకట్టడాలు తొలగింపునకు గతంలో మజ్లిస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయదుర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో రైలు మార్గం 74.7 కిలోమీటర్లు అవుతుంది.

Whats_app_banner