TG CPGET 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - జూలై 3 నుంచి సీపీగెట్ హాల్ టికెట్లు-tg cpget 2024 hall tickets will be released on the official website on july 3 direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cpget 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - జూలై 3 నుంచి సీపీగెట్ హాల్ టికెట్లు

TG CPGET 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - జూలై 3 నుంచి సీపీగెట్ హాల్ టికెట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 27, 2024 02:10 PM IST

TG CPGET 2024 Hall Tickets 2024: జూలై 6వ తేదీ నుంచి తెలంగాణ సీపీగెట్ 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు జూలై 3వ తేదీన విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో పీజీ ప్రవేశాలు 2024
తెలంగాణలో పీజీ ప్రవేశాలు 2024

TG CPGET 2024 Hall Tickets 2024: తెలంగాణ సీపీగెట్ (TS CPGET 2024) పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్జేట్ అందింది. జూలై 3వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

జూలై 6 నుంచి పరీక్షలు….

ఇటీవలే సీపీగెట్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 17వ తేదీతో ఈ పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి.రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహిస్తోంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు. మే 18 నుంచి జూన్‌ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించారు.రూ.2 వేల ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.సీపీగెట్‌ పూర్తి వివరాలను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో చూడొచ్చు. ఈ లింక్స్ లోకి వెళ్లే హాల్ టికెట్లను కూడా పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)కు పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే అవుతారు.

మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహిస్తారు.ఈ ఏడాది ఉస్మానియా వర్శిటీ నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Whats_app_banner