Telangana Budget 2024 : ఇవాళ తెలంగాణ బడ్జెట్ - సభలో ప్రవేశపెట్టనున్న భట్టి-telangana govt to present vote on account budget 2024 today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Budget 2024 : ఇవాళ తెలంగాణ బడ్జెట్ - సభలో ప్రవేశపెట్టనున్న భట్టి

Telangana Budget 2024 : ఇవాళ తెలంగాణ బడ్జెట్ - సభలో ప్రవేశపెట్టనున్న భట్టి

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 10, 2024 06:54 AM IST

Telangana Budget 2024 Updates: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. ఆర్థిక మంత్రి హోదాలో భట్టి విక్రమార్క పద్దును సభ ముందుకు తీసుకురానున్నారు.

ఇవాళ తెలంగాణ బడ్జెట్ 2024
ఇవాళ తెలంగాణ బడ్జెట్ 2024 (cmo twitter)

Telangana Budget 2024 : తెలంగాణ సర్కార్ ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌(vote-on-account budget)ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ కానుంది. ఈ సమావేశంలోనే…. ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఆమోదముద్ర పడనుంది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో ఉండనున్నాయి. ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది సర్కార్.

శనివారం మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క(Finance Minister Mallu Bhatti Vikramarka) అసెంబ్లీ ముందుకు పద్దను తీసుకురానుండగా… మరోవైపు శాసన మండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు ప్రవేశపెట్టనున్నారు.

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలు లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత…. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని బీఏసీలో సమావేశంలో కూడా చర్చించారు.

ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. వీటిలోని పలు అంశాలకు సంబంధించి కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. విద్యుత్, వ్యవసాయం, పంచాయితీరాజ్ తో పాటు పలు శాఖలకు అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

తొలిసారిగా భట్టి….

Finance Minister Mallu Bhatti Vikramarka: ఆర్థిక మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆర్ధిక శాఖా మంత్రిగా రాష్ట్ర తొలి పద్దు(Telangana Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఇది ఒక అరుదైన గౌరవంగానే విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మహ్మద్ రజబ్ అలీ తర్వాత ఒకే నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన ఘనత మల్లు భట్టి విక్రమార్కదే కావడం గమనార్హం. సిపిఐ నేత రజబ్ అలీ 1983,1985, 1989,1994 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా అప్పటి సుజాత నగర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత భట్టి మధిర నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుస విజ యాలతో మహ్మద్ రజబ్ అలీ రికార్డును సమం చేశారు.

తొలిసారి 2009లో శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన విక్రమార్క 2018 నుంచి 2023 వరకు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అత్యంత కీలకమైన ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హయాంలో అప్పుల కుప్పగా మారిన నేపథ్యంలో ఎంతో సంక్లిష్టత నడుమ ఈనెల 10న(శనివారం) శాసన సభలో 2024 - 2025 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Whats_app_banner