TS Assembly Budget Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
TS Assembly Budget Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించనున్నారు.
TS Assembly Budget Session: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళసై ఉదయం 11.30కు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నిర్వహిస్తారు. 10వ తేదీన న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలు, కులగణన బిల్లు సహా పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. శాసన సభా సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, స్పీకర్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.
బడ్జెట్‌లోని అంశాలపై 12వ తేదీ నుంచి చర్చ జరగనుంది. కనీసం ఆరు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష నేతలతో సంప్రదించి సభ నిర్వహణ ఖరారు చేయనున్నారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో సంబంధత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని స్పీకర్ అన్నారు.
మరోవైపు పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్ గుత్తా సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మండలిలో మంత్రులు అందుబాటులో ఉండాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని మంత్రి శ్రీధర్‌బాబు చీఫ్‌సెక్రటరీకి సూచించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు లేకుండా చూడాలన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.