Telangana Temples : ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు, తిరుమల ఘటనతో అప్రమత్తమైన దేవాదాయశాఖ
Telangana Temples Prasadam : తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపరి ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.
Telangana Temples Prasadam : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. లడ్డూ ప్రసాదంపై తెలంగాణలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకు విజయ డెయిరీ నెయ్యి చేరింది. విజయ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి భక్తులకు ప్రసాదంగా అందించే పనిలో అధికార యంత్రంగా నిమగ్నమైంది.
ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు పరమ పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో తప్పిదం జరిగిందని ఆరోపణలు రావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ అప్రమత్తమైంది. ప్రధాన ఆలయాల్లో తాజా ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశాలిచ్చారు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంతకాలం వాడిన కరీంనగర్ డెయిరీ నెయ్యిని బంద్ చేసి విజయ డెయిరీ నెయ్యి వినియోగం మొదలు పెట్టారు. ఆలయాలకు విజయ డెయిరీ కిలో నెయ్యి 609 రూపాయలకే సప్లై చేస్తుంది. కరీంనగర్ డెయిరీ నెయ్యి కంటే కిలో 12 రూపాయలు విజయ డెయిరీ నెయ్యి తక్కువకు లభిస్తుండడంతో ప్రభుత్వ నిర్ణయం ఆలయాలకు ఖర్చు తగ్గే అవకాశం ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు.
వేములవాడ ఆలయానికి రూ.20 కోట్ల ఆదాయం
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ప్రత్యేకంగా స్వామివారి ప్రసాదం లడ్డూలను మహా ప్రసాదంగా భావించి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. లడ్డూల తయారీని ఒక ఏఈవో, పర్యవేక్షకుడు, సిబ్బంది తనిఖీ చేస్తారు. భక్తుల రద్దీ అంచనాతో లడ్డూలను తయారు చేస్తుంటారు. దాదాపు ప్రతి నెల 10 నుంచి 15 వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగిస్తుంటారు. ఆలయానికి ఏడాదికి రూ.20 కోట్ల ఆదాయం లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా సమకూరుతోంది. కిలో లడ్డూ తయారీకి 650 గ్రాముల నెయ్యి వినియోగించాల్సి ఉంటుంది. ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యికి ఆరు నెలల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అందుకు అనుగుణంగానే నాణ్యమైన నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగిస్తున్నామని ఏఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీ సమయంలో తూనికలు, నాణ్యత ప్రమాణాల అధికారులు నెయ్యి నమూనా తీసుకెళ్లారు. నాన్యతను పరిశీలించి లోటుపాట్లను ఎత్తిచూపారు.
ధర్మపురిలో తొలి విడతగా 980 కేజీల నెయ్యి
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20, 200 గ్రాముల పులి హోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. ప్రతిరోజు సరాసరి 2 వేలు, శని, ఆదివారాలు 3 నుంచి 5 వేల వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు. దిట్టం సామగ్రిని ఉప ప్రధాన ఆర్చకుడు, సంబంధిత స్టోర్ ఇన్చార్జి, ఈవో ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. 10 కిలోల లడ్డూ ప్రసాదానికి 7 కిలోల నెయ్యి, 20 కిలోల చక్కెర, కాజు 700 గ్రాములు, కిస్మిస్లు 750 గ్రాములు, యాలకులు 100 గ్రాములు, కర్పూరం 10 గ్రాములు, జాజికాయ 10 గ్రాములు, మిస్ట్రీ 500 గ్రాములు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. 2023 24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరిందని ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ధర్మపురి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని, ప్రస్తుతం కమిషనర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 980 కిలోల విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూ ప్రసాదం తయారు చేసి విక్రయించడం జరుగుతుందన్నారు.
కొండగట్టులో ఏటా 50 వేల కిలోల నెయ్యి వినియోగం
కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు లడ్డూతో పాటు పులిహోర ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. శని, మంగళవారాల్లో దాదాపు 15 వేల లడ్డూలు, 5 క్వింటాళ్ల పులి హోర తయారు చేసి విక్రయిస్తుంటారు. 100 గ్రాముల లడ్డు రూ.25కు, 200 గ్రాముల పులిహోర రూ.20లకు విక్రయిస్తుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నా.. పులిహోర తయారీకి ఖర్చు తక్కువ కావడంతో 75 శాతం లాభం ఈ ప్రసాదం ద్వారానే సమకూ రుతుందని అధికారులు చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నేపథ్యంలో కొండగట్టు అంజన్న ఆలయానికి సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా పరీక్షలు చేయిస్తామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. లడ్డూ తయారీకి ప్రతి నెలా 4 వేల కిలోల చొప్పున, ఏడాదికి 50 వేల కిలోల వరకు నెయ్యిని ఖరీదు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేయడం, ఇతర డెయిరీ నెయ్యి కంటే 12 రూపాయల తక్కువకే దొరకడం శుభపరిణామంగా ఆలయ అధికారులు భావిస్తున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం