Tirumala : అక్టోబర్ 1న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-koil alwar tirumanjanam will be performed in tirumala temple on october 1 in view of the annual brahmotsavams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : అక్టోబర్ 1న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala : అక్టోబర్ 1న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 28, 2024 04:21 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుందని టీటీడీ పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపింది.

తిరుమల బ్రహ్మోత్సవాలు 2024
తిరుమల బ్రహ్మోత్సవాలు 2024

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 వరకు జరగనున్న దృష్ట్యా.. అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.ఆ రోజు జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.

తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠం”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం.

ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.

ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహాయజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.

ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .

వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు…

టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ విఐపిలు మినహా) రద్దు చేసింది. కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు - వాహన సేవలు…

తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతాయి. తిరుమలలో అక్టోబర్ 3న అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4 మినహా) వాహన సేవలు ఉంటాయి. రోజు వారీగా ఉదయం, సాయంత్రం వాహన సేవల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది.

  • అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది.
  • అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 6 : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో స్వామివారు విహరిస్తారు.
  • అక్టోబర్ 7 : సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వ భూపాల సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 9: బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 12 : శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.

Whats_app_banner