AP Law and Order: లా అండ్ ఆర్డర్ గాలికి.. విఐపి భద్రత, పైరవీలు, పోస్టింగులకే తొలి ప్రాధాన్యం..-vip safety lobbying and postings are the first priority ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Law And Order: లా అండ్ ఆర్డర్ గాలికి.. విఐపి భద్రత, పైరవీలు, పోస్టింగులకే తొలి ప్రాధాన్యం..

AP Law and Order: లా అండ్ ఆర్డర్ గాలికి.. విఐపి భద్రత, పైరవీలు, పోస్టింగులకే తొలి ప్రాధాన్యం..

Sarath chandra.B HT Telugu
Jul 01, 2024 08:19 AM IST

AP Law and Order: ఏపీ పోలీసులు లా అండ్ ఆర్డర్ విధుల గురించి మర్చిపోయారు. కానిస్టేబుల్ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ప్రాధాన్య పోస్టింగులు, విఐపిల భద్రత తప్ప మరో బాధ్యత లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.

విమర్శలకు దారి తీస్తున్న పోలీసుల పనితీరు...
విమర్శలకు దారి తీస్తున్న పోలీసుల పనితీరు...

AP Law and Order: ఏపీలో గత కొన్నేళ్లుగా శాంతిభద్రతలు క్షీణించాయనే విమర్శలకు అడ్డు కట్ట పడటం లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన పాత వాసనలు వదలడం లేదు.

ఆకతాయి మూకలు, గంజాయి మత్తులో జోగుతున్న యువకులు, చైన్ స్నాచర్లు, చిన్నపాటి వివాదాలతో ఘర్షణలకు దిగే వారిని అదుపు చేయడంపై ఏపీ పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. సెటిల్‌మెంట్లు, కాసులు కురిపించే కేసులైతే తప్ప మిగిలిన వాటిని లైట్ తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కంటే నాయకులు చెప్పే ఆదేశాలను అనుసరించడం ఉత్తమంగా భావిస్తున్నారు.

చోరీల కంటే విఐపి ట్రాఫిక్ ముఖ‌్యం…

ఆదివారం రాత్రి 9.30-10 గంటల సమయంలో విజయవాడలో ఎంజి రోడ్డులో వరుస మొబైల్ చోరీలు జరిగాయి. బెంజి సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్‌ వరకు రోడ్డుపై ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళుతున్న వారి నుంచి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్లిన యువకులు ఫోన్లు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై ఓ బాధితుడు సమీపంలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేయడంతో అతను వెంటనే కంట్రోల్‌ రూమ్‌ను అలర్ట్ చేశాడు.

బ్లూ కలర్ సుజుకి యాక్సిస్ వాహనంపై వచ్చి చోరీ చేశారని, నంబర్ ప్లేట్ చూడలేదని పోలీసులకు చెప్పాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ వైపు వాహనం వెళ్ళిందని చెప్పడంతో వెంటనే బీట్‌లో ఉన్న వారిని పిసిఆర్‌ సిబ్బంది అప్రమత్తం చేశారు.

ఈ ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఏపీ మంత్రి ఒకరు ఇంటికి బయల్దేరారని ఆయన వెళ్లే మార్గంలో రూట్ క్లియర్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఆ నాయకుడు ఏ మార్గంలో వెళ్తారో తెలియక కాసేపు సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. 15-20 నిమిషాల తర్వాత ఆ నాయకుడు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌ చోరీల వ్యవహారం మరుగున పడిపోయింది. చోరీలకు పాల్పడిన వారు మాయమైపోయారు.

తనిఖీలు లేవు, నిఘా అంతకంటే లేదు..

శనివారం రాత్రి 12 గంటల సమయంలో బెంజిసర్కిల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ - మచిలీపట్నం, చెన్నై కోల్‌కత్తా- జాతీయ రహదారులపై నాలుగు వైపులా వాహనాలు ఆగిపోయాయి. టీ 20 క్రికెట్ మ్యాచ్ గెలవడంతో వందలాది మంది యువకులు రోడ్డును బ్లాక్ చేసి సంబరాలు ప్రారంభించారు. వర్షంలో తడుస్తూ హంగామా చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది చెప్పినా మాట వినకపోవడంతో చివరకు అదనపు బలగాలతో పాటు, విధుల్లో ఉన్న అన్ని స్టేషన్ల సిబ్బందిని అక్కడకు పంపాల్సి వచ్చింది.

అదే సమయంలో నగరంలోని ఫుడ్‌ కోర్టుల వద్ద కూడా వందలాది మంది యువకులు పోగయ్యారు. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో వందలాది మంది గుమిగూడటంతొో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అర్థరాత్రి దాటినా బహిరంగంగా భారీ ఎత్తున యువకులు పోగవడంతో ఉన్నతాధికారులు క్విక్ యాక్షన్ టీమ్‌లను పంపాల్సి వచ్చింది.

విజయవాడ నగరంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆంక్షలు ఉన్నా వాటిని అమలు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయడంలో పోలీసుల నిస్సహాయ స్థితి చర్చనీయాంశంగా మారుతోంది.ఏదైనా ఘటన జరిగితే హడావుడి చేయడం, నాలుగైదు రోజులు నిఘా పెట్టడం ఆ తర్వాత వదిలేయడం అలవాటుగా మారింది. శివారు ప్రాంతాలు, రైల్వే యార్డుల్లో అసాంఘిక శక్తులకు కేంద్రాలుగా మారినా వాటిపై ఎలాంటి నిఘా పెట్టడం లేదు.

ఆదాయమే ముఖ్యం…

ఏపీలో పోలీస్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వం కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసినా ఉద్యోగాల భర్తీ మాత్రం పూర్తి చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్‌లో 1650మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 1050మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. 450మంది ఎస్సైలు, 150మంది ఏఎస్సైలు ఉన్నారు. మరో 500-600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది.

శాంతి భద్రతల పర్యవేక్షణ కంటే సొంత ప్రాధాన్యతలకే దిగువ స్థాయి సిబ్బంది మొగ్గు చూపుతున్నారు. అనవసర వివాదాల కంటే తమకు కలిగే లాభమేమిటనే ధోరణితొనే ఎక్కువ మంది సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కొందరు దీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేయడంతో సామంత రాజ్యాలుగా భావిస్తున్నారు. గంజాయి ముఠాలు, నేరస్తులతో చట్టాపట్టాలేసుకుని అందిన కాడికి సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలు ఉండేవి. గత ఐదేళ్లలో సీసీఎస్ వంటి వ్యవస్థలు కూడా నెలవారీ మామూళ్లకు అలవాటు పడిపోయాయనే ముద్ర వేసుకున్నాయి.

బదిలీలకు రంగం సిద్ధం…

పోలీసుల పనితీరుపై విమర్శల నేపథ్యంలో జిల్లా స్థాయిలో స్టేషన్ల వారీగా ప్రక్షాళన చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. విజయవాడ నగరంలో ఇప్పటికే సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పదేళ్లుగా ఒకే విభాగంలో ఉన్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఏ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పనిచేసే వారైనా స్థానికులై ఉండకూడదనే నిబంధన విధించారు. స్టేషన్ల వారీగా పాతుకుపోయిన సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం ద్వారా నేరాలను కట్టడి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

WhatsApp channel