GHMC Link Roads: నగరవాసులకు గుడ్ న్యూస్.. 2 వేల కోట్లతో 104 లింక్ రోడ్లు
Hyderabad Link Roads: నగరంలో లింక్ రోడ్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ అభివృద్ధితోపాటు శివారు మున్సిపాలిటీల అనుసంధానానికి, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. స్పెషల్ పర్పస్ వెహికల్‌ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
TS Govt On Hyderabad Link Roads: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సౌకర్యం కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలుగా ఈ లింక్ రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు.
104 లింక్ రోడ్లు మంజూరు…
లింక్ రోడ్ల నిర్మాణంలో దాదాపు రూ. 572 కోట్లతో 52.36 కిలోమీటర్ల లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టగా, 273 కోట్ల విలువైన 24 కిలోమీటర్ల పొడవైన పనులు పూర్తి చేశారు. ఇవి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్ల, 298 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తైన లింక్ రోడ్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మరో 104 రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల 10 మున్సిపాలిటీల్లోని ప్రాంతాల అనుసంధానం చేసేందుకు... 2వేల 410 కోట్ల అంచనాతో 104 లింక్ రోడ్లను మంజూరు చేసింది. ప్రభుత్వం జీహెచ్ఎమ్సీలో 11వందల 60 కోట్లతో 95.47 కిలోమీటర్లు, 10 మున్సిపాలిటీల్లో 12వందల 50 కోట్లతో 103.45 కిలోమీటర్ల లింక్ రహదారుల నిర్మాణం చేపట్టింది.
పనుల వివరాలు :
GHMC పరిధిలో 95.47 కి.మీ పొడవున మొత్తం రూ. 1160 కోట్లతో 72 లింక్ రోడ్ల నిర్మాణం
GHMC చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీలలో రూ. 1250 కోట్లతో 103.45 కి.మీ. లింక్ రోడ్ల నిర్మాణం(1) బండ్లగూడ జాగీర్ (ii) ఘట్కేసర్ (iii) కొత్తూరు (iv)దమ్మాయిగూడ (v) నాగారం (vi) బడంగ్పేట్ (vii) శంషాబాద్ (viii) ఇబ్రహీంపట్నం (ix) మణికొండ (x) జవహార్ నగర్ కార్పొరేషన్
HRDCL(Hyderabad Road Development Corporation Ltd ) ద్వారా నిర్మించిన లింక్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయబడిన ప్రాంతాలు చూస్తే...
*ఖాజాగూడ సరస్సు పొడవునా 26-లింక్ రోడ్డు పొడవు 1.40 కి.మీ. - వ్యయం రూ.31.12 కోట్లు
*కారిడార్ నెం. 23 లింక్ రోడ్డు రోడ్ నెం. 45 నుండి లెదర్ పార్క్, ఓల్డ్ బొంబాయి హై వే వరకు పొడవు 1.20 కి.మీ; మొత్తం వ్యయం రూ.21.69 కోట్లు
*కారిడార్ నంబర్ 23, పాత బాంబే హైవే (లెదర్ పార్క్) నుండి రోడ్ నెం. 45 వరకు నంది హిల్స్ వద్ద 0.35 కి.మీ పొడవున హెచ్‌టి లైన్ కింద VUP నిర్మాణం; మొత్తం వ్యయం రూ.30.30 కోట్లు
*కారిడార్ నెం. 39A- ISB రోడ్డు నుండి ల్యాంకో హిల్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డులో కొంత భాగం పొడవు 1.94 కి.మీ; మొత్తం వ్యయం రూ.17.00 కోట్లు
*కారిడార్ నెం. 01-నిజాంపేట్ X రోడ్ల నుండి హైటెక్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డు పొడవు 0.75 కిమీ; మొత్తం వ్యయం రూ.6.41 కోట్లు*
**కారిడార్ నం. 3:మియాపూర్ మెట్రో డిపో నుండి కొండాపూర్ వరకు, వ్యయం రూ 2.87 కోట్లు.
**కారిడార్ నెం. 43-నోవాటెల్ నుండి RTA ఆఫీస్ వరకు లింక్ రోడ్డు, వ్యయం రూ 5.58 కోట్లు.
**కారిడార్ నెం. 32- చిత్రపురి హిల్స్ మీదుగా ఖాజాగూడ రోడ్డుకు పాత బాంబే హైవే.పొడవు 950 మీ; మొత్తం వ్యయం రూ.15.07 కోట్లు.
**కారిడార్ నం. 27 ఖాజాగూడ సరస్సు నుండి ORR వరకు ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కి సమాంతరంగా. 1 కిమీ పొడవు, వ్యయం రూ.47.66 కోట్లు.
** కారిడార్ నెం. 99- సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుండి పిర్జాదిగూడ రోడ్డు పొడవు 2.60 కి.మీ; మొత్తం వ్యయం రూ.25.60 కోట్లు, మరియు మొత్తం పొడవు 4.74 కి.మీ; మొత్తం ఖర్చు రూ.34.23 కోట్లు
**పైన పేర్కొన్న కారిడార్‌లతో పాటు, 12.66 కిలోమీటర్లు పొడవైన 11 ఇతర మిస్సింగ్ లింక్ కారిడార్‌లను మొత్తం రూ 108.93 కోట్ల వ్యయంతో HRDCL నిర్మించింది.