Hyderabad Real Estate : హైదరాబాద్‌లో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు కొత్త విధానం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే
Hyderabad Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, భవనాల నిర్మాణాలకు సంబంధించి.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ వన్ స్థాయిలో క్లియరెన్స్ విధానంలో మార్పులు చేశారు. ఈ విధానంలో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను భాగస్వామ్యం చేశారు. వారు ఓకే అంటేనే ఫైల్ ముందుకెళ్తుంది.
హెచ్ఎండీఏ పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ఎల్1 క్లియరెన్స్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. దరఖాస్తుల పరిశీలనలో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను భాగస్వామ్యం చేస్తూ.. రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రాబోవని ప్రభుత్వం భావిస్తోంది.
హెచ్‌ఎండీఏ నుంచి జేపీవో లేదా ఏపీవో, రెవెన్యూ శాఖ నుంచి ఆర్‌ఐ, ఇరిగేషన్ శాఖ నుంచి ఏఈ.. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఎల్1 అనుమతులు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత.. హెచ్‌ఎండీఏ స్థాయిలో ప్లానింగ్ అధికారి, డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. మొదట మూడు శాఖల నుంచి ముగ్గురు అధికారులు సమ్మతి తెలిపితేనే.. ఆ ఫైలు ప్లానింగ్ అధికారి వద్దకు వెళ్లనుంది.
6 ముఖ్యమైన అంశాలు..
1.హెచ్ఎండీఏ పరిధిలో.. లేఅవుట్లు, ఐదు అంతస్తుల దాటిన భవనాల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ వివరాలు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలకు వెళతాయి.
2.ఈ మూడు విభాగాలు పరిశీలించాక.. సంతృప్తి చెందితేనే ఆ దరఖాస్తు ఫైలు ముందుకు కదులుతుంది.
3.ఎల్-1 పరిశీలనలో భూమి అసలు యజమాని ఎవరు? ఏమైనా ప్రభుత్వ భూమి అందులో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా, కోర్టు వివాదాలు ఏమైనా ఉన్నాయా.. అనే వివరాలను రెవెన్యూ శాఖ పరిశీలించి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో నివేదికను అప్‌లోడ్ చేస్తుంది.
4.ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ పరిధికి వెళ్తుంది. ఏవైనా చెరువులు, వాగులు, ఇతర నీటి కుంటలు ఉన్నాయా లేదా అని నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలిస్తారు.
5.ఇరిగేషన్ ఆఫీసర్లు పరిశీలన తర్వాత హెచ్‌ఎండీఏ స్థాయిలో మాస్టర్‌ప్లాన్ ప్రకారం.. లేఅవుట్, భవనం ఏ జోన్‌లో ఉంది, రోడ్లు ఏమైనా లేఅవుట్‌పై నుంచి వెళ్తున్నాయా అని పరిశీలిస్తారు.
6.ఎల్-1 పరిశీలన అయ్యాక.. ఎల్2 స్థాయిలో ప్లానింగ్ ఆఫీసర్ మరోసారి దరఖాస్తును పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి ఎల్-1 స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ ఇచ్చిన నివేదికపై తనిఖీ చేస్తారు. పూర్తి సంతృప్తి తర్వాతే ఆమోదముద్ర వేస్తారు. అప్పుడు ఆ అప్లికేషన్ డైరెక్టర్ వద్దకు చేరుతుంది.
అసంతృప్తి..
అయితే.. ఈ విధానంపై రియల్టర్లు, బిల్డర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని శాఖలను భాగస్వామ్యం చేయడం వల్ల.. దరఖాస్తుల పరిష్కారం మరింత జాప్యం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే రకరకాల కారణాలతో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని.. అయినా లంచాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారని వాపోతున్నారు. ఏమైనా మార్పులు తీసుకొస్తే.. అవి అనుమతుల్లో వేగం పెంచేలా ఉండాలని కోరుతున్నారు.