TG Indiramma House Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వం కీలక ప్రకటన
TG Indiramma House Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయించనున్నట్టు వెల్లడించింది. లబ్ధిదారుల కోసం ఒక యాప్ డిజైన్ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దీంతో ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం అయ్యిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల కోసం ఒక యాప్ డిజైన్ చేశామన్న పొంగులేటి.. నాలుగు దశల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలం ఉన్నవారికి దశల వారీగా రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇంటి యజమానిగా మహిళలను ఎంపిక చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు వాడుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణలో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలని సూచించారు. తొలివిడతగా నియజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్లను మంజూరు చేయబోతున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తామన్నారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ ఆశయమని పొంగులేటి స్పష్టం చేశారు. ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామన్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో గొడవలు..
ఇందిరమ్మ కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కమిటీల్లో వారు లేకుండా చూడాలని లోకస్ కాంగ్రెస్ లీడర్లు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీల్లో ఇంకా బీఆర్ఎస్‌కు చెందిన పాలకవర్గాలే ఉన్నాయి. కౌన్సిలర్లు కమిటీల్లో ఉండాలి. కానీ.. అందుకు కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవడం లేదు. దీంతో గొడవలు జరుగుతున్నాయి.