TS Gruha Lakshmi Scheme : 'గృహలక్ష్మి' స్కీమ్ రద్దు - తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం
Telangana Gruha Lakshmi Scheme Cancelled : గత ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది.
Gruha Lakshmi Scheme Cancelled: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా…. గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన గృహలక్ష్మి స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఎన్నికల సమయంలోనే ఇళ్ల పథకంపై కాంగ్రెస్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గృహలక్ష్మి స్థానంలో… అభయహస్తం(ఇందిరమ్మ ఇళ్లు) స్కీమ్ ను తీసుకొస్తామని ప్రకటించింది. అందుకుతగ్గట్టే…. ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త స్కీమ్ నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
గృహలక్షి స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిల్లో పలువురిని లబ్ధిదారులుగా కూడ ఎంపిక చేసింది నాటి బీఆర్ఎస్ సర్కార్. మూడు విడతల్లో మొత్తం 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయాలని భావించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో…ఈ స్కీమ్ ప్లేస్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుతం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా ఐదు పథకాల కోసం అప్లికేషన్స్ ను స్వీకరిస్తుండగా…. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా ఉంది. తొలుత సొంత జాగ ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. అర్హులైన వారిని ఎంపిక చేసి… రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనుంది.