TS Republic Day: నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఎన్నికల ఫలితాలే నిదర్శనం- గవర్నర్ తమిళ సై
TS Republic Day: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పదేళ్ల పాటు తెలంగాణ సాగిన నియంతృత్వ పాలనకు ప్రజలు ఎన్నికల్లో చరమ గీతం పాడారని గవర్నర్ తమిళ సై అన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు.
TS Republic Day: ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలంగాణ గవర్నర్ తమిళ సై అన్నారు. అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానత్వానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 11కోట్ల మంది మహిళలు మహాలక్ష్మీ స్కీమ్‌లో ఉచిత బస్సు సదుపాయాలను వాడుకున్నారని చెప్పారు. వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామన్నారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిన పెడతామని, గత ప్రభుత్వాల నిర్వాకంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిన పెడతామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన యువత అకాంక్ష నెరవేరుస్తామన్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని గవర్నర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తమ ప్రభుత్వం చేయదన్నారు. అందరికి సమాన అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ చెప్పారు.
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకల గవర్నర్ తమిళ సై నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అంతంగా ముస్తాబు చేవారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
పరేడ్ గ్రౌండ్‌లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు.
'తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదని చెప్పారు.
పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాయని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయన్నారు
ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టిందని గవర్నర్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు
గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో తెలంగాణలో ఆర్థికస్థితి దిగజారిందని, టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు.
అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తుందని అన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని ప్రతిన బూనారు.