TBJP Defector Plan : ఫిరాయింపుదారులతో కేసీఆర్ ను ఢీకొట్టగలరా? టీబీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
TBJP Defector Plan : తెలంగాణలో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ... కేసీఆర్ ను ఫిరాయింపుదారులతో ఢీకొట్టాలని భావిస్తే పశ్చిమ బంగాల్ సీన్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
TBJP Defector Plan : శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత తెలంగాణ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ చేరిక కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఇటీవల పొంగులేటి, జూపల్లిని బీఆర్ఎస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఇద్దరు నేతలతో బీజేపీ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సస్పెన్షన్‌కు గురైన బీఆర్‌ఎస్ నేతలతో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు సంప్రదింపులు జరపడం బాగానే ఉన్నా... ఈ తంతు తెలంగాణ బీజేపీ అగ్రనాయకులు తెలియకపోవడం పార్టీలో లుకలుకలను బయటపెట్టాయి. ఖమ్మంలో పొంగులేటి, జూపల్లితో చర్చల సమాచారం తనకు తెలియదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పడంతో...ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న విభేదాలను ఇప్పుడు బయటపడ్డాయి. పార్టీలో చేరికలకు గేట్లు తెరిచే ఉన్నాయని బీజేపీ చేరికల కమిటీ సభ్యులు పదే పదే చెబుతున్నా... కీలక నేతలు చేరకపోవడంతో బీజేపీ అధిష్ఠానం ఈ కమిటీపై అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు విస్తున్నాయని చెబుతున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి అంతగా ఫిరాయింపులు లేకపోవడంతో చేరికల కమిటీ వైఫల్యం చెందిందని పార్టీ నేతలు అనుకుంటున్నారని సమాచారం.
అయితే కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఉపయోగిస్తున్న ట్రంప్ కార్డు తానేనని ప్రచారం చేసుకున్న ఈటల రాజేందర్... ప్రస్తుతం వీలర్-డీలర్ స్థాయికి పడిపోయారు. మొదట్లో తనను తాను బీజేపీ జెండా మోసిన వ్యక్తిగా ప్రమోట్ చేసుకున్న ఈటల, కేసీఆర్ కు వ్యతిరేకంగా ట్రంప్ కార్డ్‌గా తనను తాను ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలను బీజేపీ షిఫ్టు చేసే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఒక రకమైన “వీలర్-డీలర్” స్థాయికి పడిపోయారని వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.
టీబీజేపీ ఫిరాయింపుదారులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసినప్పటికీ, కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి మినహా, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగే సంకేతాలు పెద్దగా కనిపించడంలేదు. బీజేపీ చెబుతున్నట్లు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటి వరకూ ఫిరాయింపులు జరగకపోవడం చాలా విచిత్రం అంటున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ బీజేపీలోకి ఫిరాయించడం, ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడంతో... ఇక అసంతృప్త నేతలంతా బీజేపీకి క్యూ కడతారని భావించారు. కానీ బీజేపీ ఇచ్చిన ఝలక్ తో బీఆర్ఎస్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈటల తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్ద ఫిరాయింపులు లేవు. కేసీఆర్‌ను అధికారం నుంచి దింపేందుకు ఇదే మంచి ప్రత్యామ్నాయమని ప్రచారం సాగుతున్నప్పటికీ, పార్టీ ఫిరాయింపుదారులతో ఒప్పందం కుదుర్చుకోవడంలో బీజేపీ చేరికల కమిటీ విఫలమైందనేది వాస్తవం. ఇది టీబీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.
ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న కేసీఆర్‌ను గద్దె దించాలన్న బీజేపీ ఆశయాలు ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందడంతో మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలను గెలుచుకోవడం తెలంగాణలో బీజేపీ ఆశలకు ఆజ్యం పోసింది.
అప్పటి నుంచి తెలంగాణలో యాక్టివ్ అయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడంతో పాటు తరచూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించడం... బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టిసారించడం మొదలైంది. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రచారానికి జాతీయ నాయకత్వం నేతలను మోహరిస్తుండడం చూస్తుంటే.. కేసీఆర్ ఎత్తుగడలకు సరిపడేలా టీబీజేపీ లేదన్న పరిస్థితికి నిదర్శనం. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికి సముచితమైన, ప్రజాదరణ పొందిన నేత ఎవరూ లేరన్నది వాస్తవం. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినా... అది స్టోర్ ముందు భాగంలో "హెల్ప్ వాంటెడ్" సైన్ బోర్డులా మిగిలిపోయింది.
బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఫిరాయింపుదారులను ఆకర్షించే ప్రయత్నం, ఆ దిశగా వీలర్-డీలర్‌ల కమిటీని ఏర్పాటు చేయడం కేసీఆర్‌ను గద్దె దింపడానికి ఎంతమాత్రం పనికాదని ప్రతిబింబిస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయింపులపై బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్‌లు కేసీఆర్‌కు ఒక సవాల్ విసురుతున్నా... కేసీఆర్ మాత్రం నరేంద్ర మోదీ విధానాలపై విరుచుకుపడుతున్నారు. మీకు వీలైతే నా నుండి చాలా మందిని దోచుకోండని కేసీఆర్ బహిరంగంగా సవాల్ చేస్తున్నారు.
ఒకవేళ బీఆర్ఎస్ అసంతృప్తుల బీజేపీకి ఫిరాయించినా అవి కేసీఆర్‌కు చిన్నపాటి అవాంతరాలుగా ఉంటున్నాయి. కానీ ఆ నేతలు బీజేపీకి భారంగా మారుతున్నారు. ఈటల రాజేందర్ లాగా ఉన్న పలుకుబడితో గెలిచే స్థాయి ఇతర నేతల్లో లేకపోవడంతో బీజేపీకి పెద్ద చిక్కులా మారింది. అంతేగాక ఖమ్మంలో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరుపుతున్న నేతలు... స్థానికంగా పేరున్న నాయకులే అయినా, వారిని పార్టీలో చేర్చుకుంటే బీజేపీ లక్ష్యాలు నెరవేరతాయా అనే సందేహం లేకపోలేదు.
కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఫిరాయింపుదారులపై ఆధారపడితే టీబీజేపీకి పెద్ద సవాలే అవుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కమలం పార్టీని నిలబెట్టేందుకు దశాబ్దాలుగా పోరాడిన బీజేపీ కురువృద్ధుడు ఒకరు ఈ విషయంపై నిరాశ వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండు పర్యాయాలలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, కుటుంబ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ... కేసీఆర్ కు ఉన్న పాపులారిటీ ముందు బీజేపీ, ఫిరాయింపుదారుల ఆదరణ సరిపోతుందా? అనే సందేహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా... ఫిరాయింపులను ప్రేరేపించే ప్రయత్నాలు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి, నరేంద్ర మోదీ ఇమేజ్, కేసీఆర్ ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలు, హిందుత్వ కార్డ్ బీజేపీ కేవలం ఒక ముఖద్వారం మాత్రమే. కేసీఆర్ పార్టీ నుమంచి సస్పెండ్ చేసిన నేతలతో డీల్ కుదుర్చుకునేందుకు బీజేపీ చూపించిన తెగువ కేసీఆర్ ను ఎదుర్కోవడంలో అవసరమని విశ్లేషకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఫిరాయింపుదారులను రంగంలోకి దింపి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఆ ఎదురుదెబ్బల నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే ఫార్ములాను తెలంగాణలో అమలుచేస్తున్నట్లు కనిపిస్తుంది.
కేసీఆర్ రెండేళ్ల పాలనపై బలమైన వ్యతిరేకత ఉందనడంలో సందేహం లేదు. కేసీఆర్‌ను తెలంగాణ ఐకాన్ నుంచి అవినీతి కుటుంబ పాలకుడిగా చిత్రీకరించడం, బీఆర్ఎస్ స్టీరింగ్ AIMIM చేతిలో ఉందని ప్రచారం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అధికార పార్టీపై వ్యతిరేకతను గ్రహించిన కేసీఆర్ ... కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అందుకోసం తెలంగాణ ఉప జాతీయవాదం వర్సెస్ బీజేపీ జాతీయవాదానన్ని తెరపైకి తీసుకువచ్చారు.
బీజేపీ జాతీయవాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉపజాతివాదాన్ని కేసీఆర్ కొత్త వ్యూహంగా తెలంగాణ ఓటర్లు భావిస్తున్నారు. బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి కేసీఆర్ రచించిన కొత్త వ్యూహంతో మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చేందుకు చూస్తున్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి, సెంటిమెంట్‌కు ఏదైనా ముప్పు ఉందని తెలంగాణ వాసులు భావిస్తే మళ్లీ ఉద్యమానికి సిద్ధంగా ఉంటారు.
కేసీఆర్ పై పోరాడడానికి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పాత, కొత్త నాయకులు, ఫిరాయింపుదారులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, బీఆర్ఎస్ నుంచి తొలగించిన నేతలను ఏకం చేయాలని చూస్తే బీజేపీకి పశ్చిమ బెంగాల్ ఫలితమే రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుకుని కాంగ్రెస్, ఇతర పార్టీలను తట్టుకుని బీజేపీ తనను తాను ఎలా ఆవిష్కరించుకుంటుందో... సొంత ఓట్లను వృధా చేయకుండా, అధికార పార్టీ వ్యతిరేక ఓటర్లను తనవైపు ఎలా తిప్పుకుంటుందో వేచిచూడాలి.
అందువల్ల బీఆర్ఎస్ ఫిరాయింపుదారుల బలంతో గెలవాలని ప్లాన్ చేయడం... బీజేపీ అసలు బలాన్ని విస్మరించి చేసే ప్రమాదకర ప్రతిపాదన అవుతుంది.