Suryapet News : సూర్యాపేటలో గులాబీ కౌన్సిలర్ల తిరుగుబాటు, అవిశ్వాసం దిశగా అడుగులు!-suryapet news in telugu brs councilors ready to put no confidence motion on chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet News : సూర్యాపేటలో గులాబీ కౌన్సిలర్ల తిరుగుబాటు, అవిశ్వాసం దిశగా అడుగులు!

Suryapet News : సూర్యాపేటలో గులాబీ కౌన్సిలర్ల తిరుగుబాటు, అవిశ్వాసం దిశగా అడుగులు!

HT Telugu Desk HT Telugu
Jan 10, 2024 08:59 PM IST

Suryapet News : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు.

సూర్యాపేట మున్సిపాలిటీ
సూర్యాపేట మున్సిపాలిటీ

Suryapet News : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల కాలం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీపై మరో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం కత్తి వేలాడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 19 మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో సంబంధం లేకుండానే, అసెంబ్లీ ఎన్నికల ముందే మున్సిపల్ ఛైర్మన్లు, కొందరు కౌన్సిలర్లు గులాబీ కండువాలు పక్కన పడేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో.. చౌటుప్పల్, చిట్యాల దేవరకొండ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. ఇప్పటికే నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. వారంలోపే నల్గొండకు కాంగ్రెస్ నుంచి కొత్త మున్సిపల్ ఛైర్మన్ రానున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం హైకోర్టు స్టేతో వాయిదా పడింది. ఇప్పుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ వంతు వచ్చింది.

సూర్యాపేట మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది?

మున్సిపల్ ఎన్నికల నాటికి సూర్యాపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. 48 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ పోస్టు కోసం జనరల్ విభాగానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు ఆశ పెట్టుకున్నారు. ఈ మేరకు కొంత ఖర్చులు పెట్టుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. అనూహ్యంగా, అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించి జనరల్ మహిళలకు చెందాల్సిన మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాన్ని ఎస్సీ మహిళకు కట్టబెట్టారు. ఇలా.. పెరుమాళ్ల అన్నపూర్ణ ఛైర్ పర్సన్ గా పీఠం ఎక్కారు. దీంతో పదవులు ఆశించిన కౌన్సిలర్లు తీవ్ర నిరాశకు లోనై లోలోన రగిలిపోయారు. అప్పటి మున్సిపల్ , ఐటీ శాఖా మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఛైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు కావడం, బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వంటి కారణాలతో మిన్నకుండి పోయారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రంలో అధికారం మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని హస్తం గతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మండల పరిషత్తుల్లో ఎంపీపీ పదవులకు, మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు అవిశ్వాసాలు పెడుతుండడంతో సూర్యాపేట కౌన్సిలర్లకూ ధైర్యం వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లే అధికంగా ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీలో పార్టీ కౌన్సిలర్లు, పార్టీకి చెందిన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

మార్పు అనివార్యమా?

సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 మంది కౌన్సిలర్లలో 36 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాల్సిందేన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ దశలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జోక్యం చేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. అవిశ్వాస తీర్మానం కోరుతున్న 36 మంది కౌన్సిలర్లలో మెజారిటీ బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఒక వేళ పార్టీ ఒప్పుకోకపోతే ఏక మొత్తంగా పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. దీంతో సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్స్, వైస్ ఛైర్మన్ మార్పు అనివార్యంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాక, తొలి రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళకు ఛైర్ పర్సన్ పోస్టు, మరో ఎస్సీ కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ పోస్టులకు ఎన్నుకోవాలన్న సూత్రప్రాయం అంగీకారం కూడా ఈ 36 మంది కౌన్సిలర్ల మధ్య కుదిరిందని తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం తెరవెనక ఉండి పావులు కదుపుతోందన్న అభిప్రాయం కూడా ఉంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

IPL_Entry_Point