Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో విగ్రహాలు చోరీ.. గుడి మూసివేత!
Kondagattu temple in Jagityal district: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.
Idols Stolen at Kondagattu Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం. వీటి విలువ మొత్తం రూ. 9 లక్షలుగా ఉంటుందని అంచనా. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లారు అర్చకులు. ప్రధాన ద్వారం నుండే దొంగలు చొరబడినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. రాత్రిపూట నలుగురు హోంగార్డులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారు. కొండగట్టు ఆలయ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా దొంగతనంగా తెలుస్తోంది. ఆలయానికి చేరుకున్న పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దొంగలు ముసుగులు వేసుకుని వచ్చారని గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన సంగతి తెలిసిందే. ఆంజనేయ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మాల ధరించే వారు ఇక్కడికి వచ్చి మొక్కులు తీరుస్తారు. ఇక ఈ మధ్యనే ఆలయ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటించారు. ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయటమే కాదు… రూ. 600 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి.. డిజైన్లు రూపొందించనున్నారు. యాదాద్రి తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దాదాపు 300 ఏండ్ల క్రితం నిర్మితమైన, అత్యంత పురాతనమైన చారిత్రక కొండగట్టు అంజన్న దేవస్థానాన్ని రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ కి అనుగుణంగా , ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఆగమశాస్త్ర నియమనిబంధనలకు లోబడి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సుమారు 750-800 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కొండగట్టుపై ఉన్న కోనేరు, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాల గురించి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆగమ శాస్త్రం, వాస్తు నియమాలను అనుసరించి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను చేపట్టాలని పేర్కొన్నారు. భక్తులు గుడికి చేరుకునే రోడ్డు, తిరిగి గుడి నుండి బయటకు వెళ్ళే రోడ్డును వీలైనంత విశాలంగా నిర్మించాలని, క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొండగట్టును అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో… గుడిలో చోరీ జరగటం చర్చనీయాంశంగా మారింది. చోరీ చేసిన వాళ్లు స్థానికులా..? లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులా…? అనేది తెలియాల్సి ఉంది.