Siddipet Crime : సిద్దిపేటలో దారుణం, మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ-siddipet crime news in telugu mentally ill uncle killed sister daughter thrown in mud ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Crime : సిద్దిపేటలో దారుణం, మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ

Siddipet Crime : సిద్దిపేటలో దారుణం, మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన మేనమామ

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 07:35 PM IST

Siddipet Crime : సిద్దిపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మేనమామ మూడేళ్ల మేనకోడల్ని బురద నీటిలో ముంచి హత్య చేశాడు.

సిద్దిపేటలో దారుణం
సిద్దిపేటలో దారుణం

Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మేనమామ మూడేండ్ల మేనకోడల్ని బురద నీటిలో ముంచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బుద్ధిపడగ గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పిట్టలు పట్టే కులస్థులు అయిన గుజరాతి సంతోష ,రాజు దంపతులకు ఒక కూతురు శిరీష (3) ఉంది . వీరు కొద్ది రోజుల కింద బుద్దిపడగ గ్రామానికి వచ్చి మామిడి తోటను పండ్ల కోసం లీజుకు తీసుకున్నారు. అదే తోటలో సంతోష తమ్ముడు శ్రీనుతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా మతిస్థిమితం లేని శ్రీను మామిడి తోట పక్కన ఉన్న వరిని తీసేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారి శిరీషను చూసిన మేనమామ శ్రీను పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకొని వెళ్లి నాటు వేసిన బురద మడిలో ముంచాడు. అది గమనించిన తల్లిదండ్రులు వచ్చి బాలికను బురదలో నుండి బయటకు తీశారు. కానీ అప్పటికే బాలిక ఊపిరాడక మృతి చెందింది. దీంతో గ్రామస్థులు అతనిని చితక బాది, చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనుకు మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

బంధువుల అంత్యక్రియలకు సాత్విక్ తాత, నాయనమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో వీరి ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి . ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి రాములు, అతని భార్య లక్మి, మనమడు స్వాత్విక్ తో కలిసి ద్విచక్ర వాహనంపై నాగిరెడ్డి పల్లిలో ఉన్న తమ బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతున్న బండిని సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ (15) మృతి చెందాడు. గాయపడిన రాములు, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం అసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం