MLA Sayanna : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
MLA Sayanna : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
MLA Sayanna : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె, కిడ్నీకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన... యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే సాయన్న మృతితో.. కంటోన్మెంట్ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1951 మార్చి 5న హైదరాబాద్ చిక్కడపల్లిలో జన్మించిన సాయన్న.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, న్యాయ విద్య పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన ఆయన... ఆనాటి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం... బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి... కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. ఇలా... తన రాజకీయ జీవితంలో... మొత్తం ఐదు సార్లు (1994, 1999, 2004, 2014, 2018) ఎమ్మెల్యేగా గెలుపొందిన జీ సాయన్న... సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
జీ సాయన్న.. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగానూ వ్యవహరించారు. హుడా డైరెక్టర్ గా 6 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వంలో... వీధి బాలల పునరావాసంపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు.
ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న అరుదైన ఘనత సాధించారన్న సీఎం.. వివిధ పదవుల ద్వారా ఆయన చేసిన ప్రజా సేవ చిరస్మరణీయమన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న ఇక లేరన్న వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎమ్మెల్యే సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు. పలువురు మంత్రులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు సాయన్న కుటుంబానికి సానుభూతి తెలిపారు.
టాపిక్