Karimnagar District : అడ్డొస్తే అంతు చూడటమే....! బరితెగిస్తున్న ఇసుక మాఫియా..!-sand mafia terrorising in karimnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar District : అడ్డొస్తే అంతు చూడటమే....! బరితెగిస్తున్న ఇసుక మాఫియా..!

Karimnagar District : అడ్డొస్తే అంతు చూడటమే....! బరితెగిస్తున్న ఇసుక మాఫియా..!

HT Telugu Desk HT Telugu
Jun 26, 2024 12:24 PM IST

Sand Mafia in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా బరి తెగిస్తోంది. అక్రమ దందాను అడ్డుకునేందుకు యత్నిచిన వారిపై మాఫియా తమ ప్రతాపం చూపుతుంది. ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు.

బరి తెగిస్తున్న ఇసుక మాఫియా...!
బరి తెగిస్తున్న ఇసుక మాఫియా...!

Sand Mafia in Karimnagar : రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక దందా పంథా మారడం లేదు. క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుపోయిన మాఫియా.. దర్జాగా దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఇసుకాసురుల పై కఠిన చర్యలు లేక రెచ్చిపోతున్నారు.

అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ అడొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మానేరు, మోయతుమ్మెద, మూల వాగులు, గోదావరి నది పరీవాహక ప్రాంతాల నుంచి రాత్రింబవళ్లు సహజ వనరులను దోస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం దాదాపు 4 వేలకు పైగా ట్రాక్టర్లలో టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

పోలీస్ పై హత్యాయత్నం….

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు యత్నించిన పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడింది. పట్టుకున్న ట్రాక్టర్ పై కానిస్టేబుల్ కూర్చుని స్టేషన్ కు తరలిస్తుండగా డ్రైవర్ వేగం పెంచి ట్రాక్టర్ పై నుంచి దూకేసి కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను చెరువులోకి దూసుకెళ్ళేలా చేశాడు. ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్ళి బోల్తాపడడంతో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన ముస్తాబాద్ మండలం నామాపూర్ లో జరిగింది. గోపాల్ పల్లె తండాకు చెందిన భూక్య గురుబాబు ఇసుక దందా చేస్తున్నాడు. రాత్రివేళ అక్రమంగా మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శేఖర్ రెడ్డితోపాటు పోలీసు సిబ్బంది రైడ్ చేసి నామాపూర్ శివారులో ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో పోలీస్ ను బందో బస్తుగా పెట్టి ఠాణాకు తరలించే ప్రయత్నం చేశారు. చివరి ట్రాక్టర్ పై కానిస్టేబుల్ సత్యనారాయణ కూర్చుని స్టేషన్ కు వెళ్తుండగా ట్రాక్టర్ నడుపుతున్న గురుబాబు ఠాణాకు తీసుకెళ్ళవద్దంటూ కానిస్టేబుల్ తో వాగ్వివాదానికి దిగాడు. మేళ్లచెరువు కట్టపైకి రాగానే ట్రాక్టర్ వేగం పెంచి చెరువులోకి తిప్పి.. గురుబాబు దూకి పరారయ్యాడు.

ట్రాక్టర్ చెరువులోకి దూసుకుపోయి నీటిలో బోల్తాపడింది. కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. స్టేషన్ కు ట్రాక్టర్ ఎంతకీ రాకపోవడంతో ఎస్సైతో పాటు సిబ్బంది వెనక్కివచ్చి చూడగా.. చెరువులో కానిస్టేబుల్ ఆర్తనాదాలు వినిపించడంతో వెలికి తీసి కరీంనగర్ కు తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.

డ్రైవర్ పై హత్యాయత్నం కేసు నమోదు…

ఇసుక అక్రమ దందా చేయడమే కాకుండా పట్టుకున్న పోలీస్ ను చంపేందుకు యత్నించడంతో పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గురుబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ తెలిపారు. అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ చెప్పారు.

ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడైన గురుబాబుపై రౌడీషీట్ తో పాటు 13 కుపైగా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయని వెల్లడించారు. మిగతా నాలుగు ట్రాక్టర్ల డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ప్రకటించారు.

రెండు రోజుల కిందట వేములవాడ మూల వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న మైనింగ్ అధికారితో ట్రాక్టర్ల డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించారు. ఇసుక ట్రాక్టర్ లను అడ్డుకునేందుకు యత్నించగా ఆపకుండా అడ్డుకునే మైనింగ్ అధికారుల పైకి తీసుకెళ్లేందుకు యత్నించారు. తమకు అడ్డురావద్దంటూ అధికారితో వాగ్వాదానికి దిగారు.

ఇసుక ఆదాయ మార్గం..

జలాశయాలు, నీటి పరీవాహక ప్రాంతాలు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి ఇసుక రవాణా ఆదాయ మార్గంగా మారింది. అధికారిక రీచ్ లు ఉన్నా వందలాది ట్రాక్టర్లలో దొడ్డి దారిన తరలిస్తున్నారు. వర్షాకాలంలో వాగులు, వంకల్లో నీళ్లు నిలవకముందే అందినకాడికి దోచుకోవాలన్న ఆలోచనతో కొద్ది రోజులుగా అక్రమార్కులు జోరు పెంచారు.

డీజిల్, కూలీల ఖర్చులు పోగా ట్రాక్టర్ ఇసుక విక్రయంతో రూ.1500-2000 సంపాదన వస్తుండటంతో చాలా మంది ఈ వ్యాపారానికి అలవాటు పడ్డారు. నది, వాగు పరీవాహక ప్రాంత గ్రామాల్లో వందల సంఖ్యలో ట్రాక్టర్లను కేవలం ఇసుక రవాణా కోసమే కొనుగోలు చేస్తున్నారు.

పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు తోడు స్థానిక నాయకుల అండతో దందా కొనసాగుతోంది. మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు. వాస్తవానికి వాల్టా చట్టం ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

747 ట్రాక్టర్ లు సీజ్…

గతేడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 614 కేసులు నమోదు చేశారు 747 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 395 కేసు నమోదు చేసి 278 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఆ తర్వాత పెద్దపెల్లి జిల్లాలో 120 కేసు నమోదు చేసి 147 ట్రాక్టర్ల సీజ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో 52 కేసులు నమోదు చేసి 242 ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలో 47 కేసుల నమోదు చేసి 80 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ కేసులు ఎక్కువ ట్రాక్టర్ లు సీజ్ అయ్యాయంటే ఏ స్థాయిలో అక్కడ అక్రమదందా సాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈసారి ఎన్ని కేసులు పెట్టారు.. ఎన్ని ట్రాక్టర్లు సీజ్ చేశారనేది అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు. అంటే వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

ఉమ్మడి జిల్లాలో ఏటా ఇసుక ట్రాక్టర్లతో దాదాపు 200 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ఘటనల్లో ద్విచక్రవాహనదారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, ఆర్టీఏ, మైనింగ్ శాఖల అధికారులు స్పందించి సమష్టిగా ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకుంటే మున్ముందు మరింత రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner