Dirty Fellow Review: డర్టీ ఫెలో రివ్యూ.. ఇండియన్ నేవీ సోల్జర్ హీరోగా చేసిన మాఫియా థ్రిల్లర్ ఆకట్టుకుందా?
Dirty Fellow Movie Review In Telugu: ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా తెరకెక్కిన సినిమా డర్టీ ఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి మే 24 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో డర్టీ ఫెలో రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: డర్టీ ఫెలొ
నటీనటులు: శాంతి చంద్ర, దీపికా సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్, నాగినీడు, ఎఫ్ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: జి.యస్. బాబు
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
సంగీతం: డాక్టర్. సతీష్ కుమార్.పి.
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్.
ఎడిటర్ : జేపీ
విడుదల తేది: మే 24, 2024
Dirty Fellow Review In Telugu: తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలుగా వచ్చారు. కమెడియన్, విలన్, డాక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలా ఎంతోమంది సినిమాల్లో హీరో అవతారం ఎత్తారు. అలాగే కొంతమంది హీరోలు డైరెక్టర్స్‌గా, ప్రొడ్యూసర్స్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా డెబ్యూ ఇచ్చారు. ఆయన నటించిన సినిమా డర్టీ ఫెలో.
ఆడారి మూర్తి సాయి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీపికా సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. అలాగే సత్య ప్రకాష్, నాగినీడు, ఎఫ్ఎమ్ బాబాయ్, జయశ్రీ సురేంద్ర, కుమరన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగా చేయడంతో డర్టీ ఫెలో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయి హైప్ క్రియేట్ అయింది. మరి ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో డర్టీ ఫెలో రివ్యూలో చూద్దాం.
కథ:
మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్‌మెంట్స్ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. ఈ క్రమంలో జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. కానీ, వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో జేపీపై శంకర్ నారాయణ పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో (శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు శంకర్ నారాయణ.
ట్విస్టులు
మరి జేపీ కొడుకు శత్రును శంకర్ నారాయణ చంపాడా? ఓ గూడెంలోని పూజారి ఇంట్లో ఉంటూ పిల్లలకు చదువు చెప్పే సిద్ధు ఎవరు? శత్రుకు, సిద్ధుకు ఉన్న సంబంధం ఏంటీ? సిద్ధు ఉన్న గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన కోసం వచ్చిన చిత్ర (సిమ్రితి) బ్యాక్ డ్రాప్ ఏంటీ? అసలు సిద్ధును చిత్ర షూట్ చేయడానికి గల కారణాలు ఏంటీ? డర్టీ ఫెలోగా పిలవబడే శత్రు, పాఠాలు చెప్పే సిద్ధు ఇద్దరూ ఒక్కరేనా? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ డర్టీ ఫెలో సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డర్టీ ఫెలో ఒక మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి జోనర్‌కు చెందిన మూవీనే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించండంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. సినిమాలో పెద్దగా ల్యాగ్ కనిపించదు. ప్లోలో అలా వెళ్లిపోతుంటుంది.
ఇంట్రెస్టింగ్ సీన్లతో
కథ ఎలా ఉన్నా టేకింగ్ ముఖ్యం కాబట్టి డైరెక్టర్ దానిపై బాగానే ఫోకస్ చేసినట్లు అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్ సీన్లతో వెళ్లిపోతుంటుంది. మాఫియా బ్యాక్ డ్రాప్, రివేంజ్, లవ్ స్టోరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో మూవీ ఎంగేజ్ చేసేలానే ఉంది. అలాగే యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది.
రెండు పాత్రలను చూపించి
మూవీలో హీరో ఎంట్రీ, టైటిల్ సాంగ్, హీరోయిన్లతో రొమాన్స్ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీ ఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. ఇక టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేలా శత్రు క్యారెక్టర్ డిజైన్ చేశారు. సినిమాలో శత్రు, సిద్ధు రెండు పాత్రలను చూపించి ఒక్కరేనా కాదా అనే సస్పెన్స్ కొనసాగించారు. ఇలాంటివి ఇదివరకు చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపించడం కాస్తా మైనసే. కానీ, చివరి వరకు సస్పెన్స్ కొనసాగించడం మెచ్చుకోదగిన విషయం.
క్లైమాక్స్ ట్విస్ట్
అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్ డర్టిఫెలో చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్ ఫూల్ సీన్ హైలెట్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్ ఫైనల్ టచ్‌లా అట్రాక్ట్ చేస్తుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్ మూవీ అనుకోవచ్చు. కానీ, స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా చెప్పాలంటే..
సినిమా టేకింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అంతా పర్వాలేదు. ఇండియన్ నేవీ సోల్జర్ అయిన శాంతి చంద్ర హీరోగా అలరించాడని చెప్పుకోవచ్చు. నటనలో ఇంకాస్తా పరిణితి రావాలి. ఇక హీరోయిన్స్ గ్లామర్ పరంగా అట్రాక్ట్ చేశారు. తమ పాత్రల్లో పరిధిమేర నటించారు. మిగతా పాత్రలు సైతం తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
రేటింగ్: 2.5/5