NGT On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!-karimnagar manair river sand mining ngt verdict pay 50 crore to godavari river management board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ngt On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!

NGT On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!

NGT On Manair Sand Mining : మానేరులో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు ఇచ్చింది. ఇసుక తవ్వకాలు చట్టవిరుద్ధమని ప్రకటించింది. మూడు నెలల్లోగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.50 కోట్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు

NGT On Manair Sand Mining : మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై సౌత్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్దమని, పర్యావరణ విధ్వంసానికి కారణమవుంతుందని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ (ఈసీ) లేకుండా ఇసుక తరలిస్తున్నారంటూ ఐదు పిటిషన్లు ఎన్జీటీలో దాఖలు అయ్యాయి. ఈసీ విషయంలో ఎన్జీటీ బెంచ్ పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినప్పటికీ ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ప్రవేశపెట్టలేదు. గతంలోనే మానేరు ఇసుక తరలింపును నిలిపివేయాలని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వం ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించి తవ్వకాలకు సానుకూలంగా వ్యవహరించింది. దీంతో ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయంపై తుది తీర్పును మంగళవారం చైన్నై బెంచ్ వెలువరించింది.

రూ.25 కోట్ల చొప్పున జరిమానా

మానేరు నదిలో డిసిల్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం తప్పేనని ఎన్జీటీ చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను మూడు నెలల్లోగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.

ఫలించిన రెండేళ్ల పోరాటం

మానేరు నదిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై స్థానికులు రెండేళ్ల పాటు ఆందోళనలు చేపట్టారు. ఈ విషయంపై న్యాయపరమైన పోరాటానికి సైతం శ్రీకారం చుట్టారు. మానేరు నదికి సంబంధించిన అంశంపై మొత్తం ఐదు పిటిషన్లు ఎన్జీటీలో నమోదయ్యాయంటే మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక రీచులు ఏర్పాటు చేసిన మానేరు పరివాహక గ్రామాలు నిద్రకు దూరమై భయం గుప్పిట జీవనం సాగించారంటే వారు ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెల్లదీశారో అర్థం చేసుకోవచ్చు. మానేరు పరివాహక ప్రాంతాల్లో జనజీవనానికే సవాల్ విసిరిన ఇసుక రీచులు, లారీల రాకపోకలతో రహదారుల వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేశాయి. దీంతో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కూడా వెనుకాడిన పరిస్థితి తయారైంది.

గోదావరికి ఉపనది అయిన మానేరులో చెక్ డ్యాంల నిర్మాణం ముసుగులో అప్పటి ప్రభుత్వం డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. టీఎస్ఎండీసీ ద్వారా టెండర్లకు ఆహ్వానించి ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలోమీటరుకో రీచ్ చొప్పన అనుమతి ఇచ్చి ఇసుక తరలింపు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇసుక తరలింపుతో అటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం... ఇటు పరివాహక ప్రాంత జనజీవనం అస్తవ్యస్థంగా మారడంతో కలత చెందిన స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించి ఇసుక తవ్వకాలను నిలిపివేయించగలిగారు. మంగళవారం చెన్నై బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తరలింపునకు శాశ్వతంగా బ్రేకులు పడినట్టయింది.