Social Media : పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా..? సజ్జనార్ సీరియస్-sajjanar is serious about silly antics for popularity on social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Social Media : పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా..? సజ్జనార్ సీరియస్

Social Media : పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా..? సజ్జనార్ సీరియస్

Basani Shiva Kumar HT Telugu
Sep 07, 2024 11:39 AM IST

Social Media : సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వెర్రి చేష్టలు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

రీల్స్ చేయడం కోసం బస్సును ఆపుతున్న యువకుడు
రీల్స్ చేయడం కోసం బస్సును ఆపుతున్న యువకుడు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు యువకులు చిల్లర చేష్టలు చేస్తున్నారు. వారి పనుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రీల్స్ చేయడం కోసం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా అని ప్రశ్నించారు.

సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ యువకుడు బస్సును ఆపి.. ఎక్కుకుండా పారిపోతాడు. దానిపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి' అని సజ్జనార్ హితవు పలికారు.

తాజాగా రీల్స్, వీడియోల మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని వీడియోలు చేసే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పరిధిలో వెలుగు చూసింది.

బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామాానికి చెందిన మోచి శివరాజు(20) స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. అతని తండ్రి ద్వారా ఈ విద్యను నేర్చుకున్నాడు. స్థానికంగా ఎవరైనా పాముల సమాచారం అందిస్తే వారి ఇంటికి వెళ్లి పట్టుకుంటాడు. ఈ క్రమంలోనే మండల పరిధిలోని ఓ గ్రామం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నాగుపాము ఉందని సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి శివరాజు.. ఆరు అడుగులు ఉన్న పామును పట్టుకున్నాడు.

పామును పట్టుకున్న తర్వాత చాలాసేపు దాంతో విన్యాసాలు చేశాడు. పాము తల భాగాన్ని నోట్లో పెట్టుకొని రీల్స్, వీడియోలు తీయించుకున్నాడు. ఈ క్రమంలోనే శివరాజు నాగుపాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శివరాజు.. స్పృహా కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.