Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్-a youngster dies after cobra bite while filming video stunt for reels in kamareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్

Kamareddy District : పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు..! కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు - వీడియో వైరల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 07, 2024 07:35 AM IST

కామారెడ్డి జిల్లా పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రీల్స్, వీడియోల కోసం పామును నోట్లో పెట్టుకున్న మోచి శివరాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతను స్థానికంగా స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నోట్లో పాము పెట్టుకుని వీడియోలు..!
నోట్లో పాము పెట్టుకుని వీడియోలు..!

రీల్స్, వీడియోల మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని వీడియోలు చేసే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లా పరిధిలో వెలుగు చూసింది.

బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామాానికి చెందిన మోచి శివరాజు(20) స్నేక్ క్యాచర్ గా గుర్తింపు పొందాడు. అతని తండ్రి ద్వారా ఈ విద్యను నేర్చుకున్నాడు. స్థానికంగా ఎవరైనా పాముల సమాచారం అందిస్తే వారి ఇంటికి వెళ్లి పట్టుకుంటాడు.  ఈ క్రమంలోనే మండల పరిధిలోని ఓ గ్రామం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నాగుపాము ఉందని సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి శివరాజు… ఆరు అడుగులు ఉన్న పామును గుర్తించి పట్టుకున్నాడు.

పామును క్యాచ్ చేసిన తర్వాత… చాలాసేపు దాంతో విన్యాసాలు చేశాడు. పాము తల భాగాన్ని నోట్లో పెట్టుకొని రీల్స్, వీడియోలు తీయించుకున్నాడు. ఈ క్రమంలోనే శివరాజు నాగుపాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శివరాజు… స్పృహా కోల్పోయాడు.

జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా… వెంటనే బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.