Telangana Thalli Statue: దొరల ఆనవాళ్లు లేకుండా,తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు…
Telangana Thalli Statue: దొరల ఆనవాళ్లు, గడీల పాలన గుర్తుకు రాకుండా, తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిచారు. తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు.
Telangana Thalli Statue: పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పానని దానిని నిలబెట్టుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వైభవం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా విగ్రహ రూపకల్పన చేయాలని జేఎన్‌టియూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి ఆ బాధ్యత అప్పగించినట్టు సిఎం చెప్పారు.
దొరలకు, గడీలలో ఉండే వారి ఆనవాళ్లతో విగ్రహం లేకుండా చూడాలని జేఎన్‌టియూ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ కు సూచించినట్టు చెప్పారు. సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్9న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు.
డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిన డిసెంబర్ 9న సోనియా జన్మిదినం కూడా కాబట్టి ఆ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించ నున్నట్టు ప్రకటించారు. నెక్లెస్ రోడ్డు మొత్తాన్ని మిలియన్ మార్చ్‌తో నింపిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేలాది మంది ప్రజలతో ఆవిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మంత్రులు కోమటిరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు, మేయర్ విజయలక్ష్మీ, అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, వీర్ల ఐలయ్య, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ శంకుస్థాపనను ప్రభుత్వం చేపట్టినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. శంకుస‌్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం యోచించిందని, ఇవాల్టి తర్వాత దసరా వరకు మంచి రోజులు లేవని వేదపండితులు సూచించడంతో , మంత్రులు ఇతర కార్యక్రమాల్లో ఉండటం , డిప్యూటీ సీఎం కేరళలో పర్యటనలో ఉండటం వల్ల పెద్ద ఎత్తున చేపట్ట లేకపోయామని సీఎం చెప్పారు.
అరవై ఏళ్ల అకాంక్షను సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాట ప్రకారం 2014లో తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు.
2014-24 వరకు ఎన్నో సాధించినట్టు చెప్పుకున్నారని, పదేళ్లు పరిపాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని, తెలంగాణ తల్లి కంటే వారే తెలంగాణకు ప్రాధాన్యం, తెలంగాణ అంటే తామే అన్నట్టు గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు.
ఆ పాత విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల కంచెలు వేసుకుని, వందలాది పోలీసులతో ఉన్నారని, దానిని జ్యోతిరావ్ ఫూలే భవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. గడిగా మారిన ప్రజాభవన్‌ను ప్రగతి భవన్ చేసి ప్రజలకు దూరం చేస్తే, దానిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
సచివాలయం తెలంగాణ పాలనకు గుండె వంటిదని, ప్రజా ప్రభుత్వం పరిపాలన ఇక్కడి నుంచి సాగించాలని, ప్రజలకు మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, పదేళ్లు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలకు సచివాలయంలో ప్రవేశమే లేకుండా చేశారని, తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేశారని రేవంత్ ఆరోపించారు.
పదేళ్లలో తెలంగాణలో రూ.22.5 లక్షల కోట్ల రుపాయలు ఖర్చు చేస్తే విగ్రహానికి కనీసం కోటి రుపాయలు కూడా వెచ్చించలేదన్నారు.తెలంగాణ తల్లి విగ్రహానికి మనసు రాలేదని విమర్శించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేశారని,ఓ పక్కన అంబేడ్కర్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహరావు, అంజయ్య, కాకా వెంకటస్వామి విగ్రహాలు, సమాధులు ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారి ఆనవాళ్లు ఉన్నాయని, రాజీవ్ విగ్రహం లేకపోవడం లోటుగా భావించి దేశం కోసం అమరుడైన రాజీవ్ విగ్రహం ఉండాలని భావించామన్నారు.
మేధావుల సూచన మేరకు సచివాలయం ముందున్న పార్క్‌లో కొందరు తమ విగ్రహాలు పెట్టుకోవాలని భావించారని, ఆ స్థలాన్ని అట్టి పెట్టుకున్నారని, రాజీవ్ విగ్రహ ఏర్పాటు కూడా రాజకీయం చేశారన్నారు. కీలకమైన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.