TS Inter Exams 2024 : నిమిషం నిబంధన సడలింపు - తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
TS Inter Exams 2024 Updates: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షకు ఒక్క నిమిషం నిబంధనను సడలించింది.
TS Inter Exams 2024 Updates: ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌కు అనుమతించింది. ఫలితంగా ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్‌కు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఉంటుంది.
ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంతో పలుచోట్ల విద్యార్థులు పరీక్షలు రాలేకపోయారు. ఫలితంగా ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేకపోయామని కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరగాల్సి వచ్చింది. పరీక్షకు అనుమతించని కారణంతో మనస్తాపానికి గురైన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మరణవార్త చర్చనీయాంశంగా మారింది. ఒక్క నిమిషం నిబంధనను సడలించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో… ఇంటర్ బోర్డు నిమిషం నిబంధనను సడలించింది.
మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144Section సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.ఇంటర్ రెండో ఏడాది Second Year ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కూడా తెలంగాణలో నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ఇంటర్ బోర్డ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనలకు ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారు.
ఇంటర్ విద్యార్థులకు బోర్డ్ సూచనలు..
పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు ఒక్క నిమి షం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
-పరీక్ష కేంద్రంలో పావుగంట ముందే ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలను 9 గంటల లోపు చూసుకుని, తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాల్సి ఉంటుంది.
-పరీక్షలలో ఒత్తిడికి గురయ్యే విద్యార్ధుల కోసం కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఇంటర్ బోర్డ్ 'టెలీ మానస్'పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040-24655027 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.